మార్కెట్ విలువ సవరణపై కౌంటర్ దాఖలు

3 Nov, 2016 01:45 IST|Sakshi

తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మరోసారి ఆదేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువ సవరణ విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు బుధవారం తెలంగాణ ప్రభుత్వాన్ని మరోసారి ఆదేశించింది. చట్టప్రకారం నిర్దిష్ట కాలవ్యవధిలోపు మార్కెట్ విలువను సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఈ బాధ్యతకు సంబంధించిన చట్టబద్ధతను తేలుస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ అంబటి శంకరనారాయణలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించకపోవడాన్ని సవాలు చేస్తూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, రైతు నాయకుడు కోదండరెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ప్రతీ రెండేళ్లకొకసారి మార్కెట్ విలువను సవరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వివరించారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) కె.రామకృష్ణారెడ్డి స్పందిస్తూ మార్కెట్ విలువను సవరించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. ఇది పూర్తిగా ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని తెలిపారు.

దీనికి ధర్మాసనం స్పందిస్తూ భూముల విలువను సవరించరాదని ఏమైనా నిషేధం ఉందా? అంటూ ప్రశ్నించింది. లేదని ఏజీ సమాధానం ఇవ్వడంతో 2014 నాటి భూముల ధరలకు, ప్రస్తుత ధరలకు ఎంతో వ్యత్యాసం ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ జీవో 123 ద్వారా భూములను కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం పాత మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లిస్తోందని, మార్కెట్ విలువను సవరిస్తే ఎటువంటి న్యాయపోరాటం అవసరం లేకుండానే రైతులు ఎకరాకు రూ.13 లక్షల వరకు పొందే అవకాశం ఉందని వివరించారు.

>
మరిన్ని వార్తలు