ఆ రెండు జిల్లాల్లో ఎస్‌జీటీ ఫలితాల్ని వెల్లడించొద్దు

17 Feb, 2018 03:21 IST|Sakshi

వరంగల్, ఖమ్మం ఫలితాలపై హైకోర్టు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ నియామక పరీక్షలకు (టీఆర్‌టీ) సంబంధించి వరంగల్, ఖమ్మం జిల్లాల సెకండరీ గేడ్ర్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) ఫలితాలను వెల్లడించవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు టీఎస్‌పీఎస్సీ, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శులను హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. మరోవైపు టీఆర్‌టీ పరీక్ష నిలుపుదలకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు నిరాకరించారు.

2012 డీఎస్సీలో భర్తీకాని దివ్యాంగుల ఎస్‌జీటీ పోస్టుల్ని తాజాగా 2017 టీఆర్‌టీ భర్తీ జాబితాలో చేర్చకుండానే ప్రకటన వెలువరించడాన్ని తప్పుపడుతూ వరంగల్, ఖమ్మం జిల్లాలకు చెందిన డి.మల్లికార్జున్, ఎస్‌.మురళి హైకోర్టును ఆశ్రయించారు. భర్తీకాని దివ్యాంగుల ఎస్‌జీటీ పోస్టులను టీఆర్‌టీలో కలిపి నిర్వహించాలని, అప్పటి వరకూ పరీక్షలు నిర్వహించకుండా స్టే ఉత్తర్వులు జారీ చేయాలన్న పిటిషనర్ల అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. 2012 డీఎస్సీలో వరంగల్‌ జిల్లాలో దివ్యాంగులకు కేటాయించిన పోస్టులు 9, ఖమ్మం జిల్లాలో 5 పోస్టులు భర్తీ కాలేదని, ఈ ఖాళీలను కలిపిన తర్వాతే టీఆర్‌టీ నిర్వహించాలన్నారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాల్లో ఎస్‌జీటీ ఫలితాల్ని తదుపరి ఆదేశాలు వెలువడే వరకు వెల్లడించరాదని సర్కార్‌ను ఆదేశించారు. అనంతరం విచారణ రెండు వారాలకు వాయిదా వేశారు.

మరిన్ని వార్తలు