ఆ ఆరు ప్రశ్నలు తొలగించండి

17 Jan, 2019 02:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎస్సై పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో పేపర్‌ బుక్‌లెట్‌ కోడ్‌–బిలోని ఆరు ప్రశ్నలను తొలగించాలని రాష్ట్ర పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డును హైకోర్టు ఆదేశించింది. 117, 138, 172, 181, 185, 189 ప్రశ్నలను తొలగించాలని బోర్డుకు స్పష్టం చేసింది. ఈ ఆరు ప్రశ్నల నిర్మాణం సక్రమంగా లేదని, అలాగే వాటికి ఇచ్చిన సమాధానాలు కూడా సక్రమంగా లేవని హైకోర్టు అభిప్రాయపడింది. ఆరు ప్రశ్నలు తొలగించాక తిరిగి అర్హుల జాబితా రూపొందించాలని ఆదేశించింది. తిరిగి అర్హుల జాబితా రూపొందించేటప్పుడు, ఇప్పటికే అర్హత సాధించిన వారిని మినహాయించాలని పేర్కొంది. తాజా జాబితాలో హాల్‌ టికెట్‌ నంబర్‌ ఎదురుగా అభ్యర్థి మార్కులు పొందుపరచాలని స్పష్టం చేసింది.

ఆ తర్వాతే శారీరక దారుఢ్య పరీక్ష నిర్వహించాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు, జైళ్లు, అగ్నిమాపక శాఖల్లో 1,217 ఎస్సై పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్‌ బోర్డు గతేడాది మే 31న నోటిఫికేషన్‌ జారీ చేసింది. గతేడాది ఆగస్టు 26న రాతపరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు సంబంధించిన పేపర్‌ బుక్‌లెట్‌–బి కోడ్‌లోని ఆరు ప్రశ్నలు తప్పని, వాటి సమాధానాలు కూడా తప్పని, వాటిపై అభ్యంతరాలను వ్యక్తం చేసినా పట్టించుకోలేదని, దీని వల్ల తమకు నష్టం కలిగిందంటూ నల్లగొండకు చెందిన డి.ఉపేందర్‌రెడ్డి, మరో 14 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు విచారణ జరిపారు.

అభ్యర్థులకు లబ్ధి..
పిటిషనర్ల తరఫు న్యాయవాది చిల్లా రమేశ్‌ వాదనలు వినిపిస్తూ, 117, 138, 172, 181, 185, 189 ప్రశ్నలు తప్పని, అలాగే వీటికి ఇచ్చిన సమాధానాలు కూడా తప్పని, అందువల్ల వాటిని తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. అభ్యర్థుల హాల్‌ టికెట్‌నంబర్ల ఎదురుగా మార్కులు పొందుపరచాల్సి ఉన్నా, అది కూడా చేయలేదని తెలిపారు. మార్కులు ప్రచురించి ఉంటే, తుది కీ అందుబాటులో ఉన్న నేపథ్యంలో వాటిని ఓఎంఆర్‌ కాపీతో పోల్చిచూసుకునే అవకాశం అభ్యర్థులకు ఉండేదని కోర్టుకు నివేదించారు. దీని వల్ల అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందని వివరించారు.

అభ్యర్థులు నిర్ణయించజాలరు..
ఈ వాదనలను రిక్రూట్‌మెంట్‌ బోర్డు తరఫున స్పెషల్‌ జీపీ ఎస్‌.శరత్‌కుమార్‌ తోసిపుచ్చారు. ఏ అభ్యర్థి కూడా ఎలాంటి అభ్యంతరాలను లేవనెత్తలేదన్నారు. జేఎన్‌టీయూ నిపుణుల ద్వారా ప్రశ్న పత్రం రూపొందించామని తెలిపారు. ఆ ఆరు ప్రశ్నలు, సమాధానాల్లో ఎలాంటి తప్పులు, సందిగ్ధత లేదన్నారు. ఏది తప్పో, ఏది ఒప్పో అభ్యర్థులు నిర్ణయించజాలరన్నారు. హాల్‌ టికెట్‌ ఎదురుగా మార్కులు పొందుపరచడం సాధ్యం కాదని, యూపీఎస్సీ, టీఎస్‌పీఎస్సీలు కూడా ఈ విధానాన్ని అనుసరించట్లేదని చెప్పారు.

పారదర్శకతకు ఆస్కారం ఉంటుంది..
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే హక్కు అభ్యర్థులకు లేదన్న బోర్డు వాదనను తోసిపుచ్చారు. మార్కులు ప్రచురించడం ద్వారా మరింత పారదర్శకతకు ఆస్కారం ఉంటుందన్నారు. దీని వల్ల అభ్యర్థులకు కూడా మార్కుల విషయంలో స్పష్టత వస్తుందని తెలిపారు. సమాచార హక్కు చట్టం అమలవుతున్న కాలంలో ప్రతీది పారదర్శకంగా ఉండాల్సిన అవసరముందని వివరించారు. ఓఎంఆర్‌ షీట్లను కంప్యూటర్ల ద్వారా మూల్యాంకనం చేయిస్తున్నప్పుడు, మార్కులను వెల్లడించడం కష్టసాధ్యమేమీ కాదని అభిప్రాయపడ్డారు. ఈ ఆరు ప్రశ్నలు ఏ రకంగా తప్పో పిటిషనర్లు స్పష్టంగా వివరణ ఇచ్చారని, ఆ వివరణలతో ఏకీభవిస్తున్నట్లు న్యాయమూర్తి తెలిపారు.

మరిన్ని వార్తలు