8 వారాల్లో విభజన పూర్తి చేయండి

13 Mar, 2018 03:11 IST|Sakshi

వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగులపై తెలుగు రాష్ట్రాలకు హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌ : వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగుల విభజన ప్రక్రియను 8 వారాల్లో పూర్తిచేయాలని హైకోర్టు సోమవారం ఇరు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. విభజన విధి విధానాలను 4 వారాల్లో ఖరారు చేసి, ఆ తర్వాత 8 వారాల్లో విభజనను పూర్తి చేయాలని స్పష్టంచేసింది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మీల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగుల విభజన జరగాల్సిన అవసరముందని ధర్మాసనం గుర్తు చేసింది.

ఏపీ స్థానికత ఉన్న తనను తెలంగాణకు కేటాయించడాన్ని సవాలు చేస్తూ వైద్య విధాన పరిషత్‌ ఆధ్వర్యంలోని కింగ్‌ కోఠి ఆసుపత్రిలో ప్రోగ్రామింగ్‌ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్‌ ఎస్‌.సుజాత హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

>
మరిన్ని వార్తలు