‘కరోనా’పై చేతులెత్తేసినట్లుంది..

17 Jun, 2020 19:13 IST|Sakshi

రాష్ట్ర ప్రభుత్వ తీరుపై హైకోర్టు ధర్మాసనం అసహనం..

ఎక్కడో ఏదో లోపం ఉంది.. గాంధీలో పరిస్థితులపై కోర్టు ఆందోళన

డాక్టర్లపై భౌతిక దాడులు జరుగుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు

లేవనెత్తిన అన్ని అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు ముందుంచాలి

ప్రభుత్వం, ఆస్పత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశం.. విచారణ నేటికి వాయిదా  

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వానికి పట్టు సడలినట్లుందని.. ఎక్కడో ఏదో లోపం ఉందని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. ఎవరి ప్రాణాలు వారే రక్షించుకోవాలి తప్ప, తామేం చేయలేనట్లు చేతులెత్తేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయంది. 72 మంది డాక్టర్లు కరోనా బారిన పడ్డారని, 400 మంది సిబ్బంది క్వారంటైన్‌లో ఉన్నారని, డాక్టర్లు, సిబ్బంది రక్షణ కోసం కిట్లున్నాయని చెప్పడానికి, వాటిని వారికి అందచేయడానికి ఎంతో తేడా ఉందని తెలిపింది. డాక్టర్లపై భౌతిక దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోందని, ప్రతి వార్డుకు, ప్రతీ డాక్టర్‌కు రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని హైకోర్టు తెలిపింది.

ఆసుపత్రుల్లో ఎంత మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.. ఎందరికి పరీక్షలు చేశారు.. ఏఏ మౌలిక సదుపాయాలున్నాయి.. డాక్టర్లు, వైద్య సిబ్బందికి వ్యక్తిగత భద్రత పరికరా (పీపీఈ) లున్నాయా.. వంటి వివరాలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివరించాలని గాంధీ, నిమ్స్, కింగ్స్‌ కోఠి, ఫీవర్, ఛాతీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

వైద్యులకు తగినన్ని పీపీఈ కిట్లు, మాస్క్‌లు ఇతర రక్షణ పరికరాలు ఇవ్వడం లేదంటూ న్యాయవాది సమీర్‌ అహ్మద్‌ హైకోర్టుకు లేఖ రాయగా, దీన్ని కోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించిన విషయం తెలిసిందే. ఆసుపత్రుల్లో పరిస్థితులు, రక్షణ పరికరాల సరఫరాపై నివేదికలివ్వాలని ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లను కోరినా ఇప్పటివరకు స్పందించకపోవడంపై ధర్మాసనం ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేసింది.

గాంధీలో పరిస్థితి ఆందోళనకరం..
గాంధీ ఆసుపత్రిలో పరిస్థితులపై ఆందోళన చెందుతున్నామని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజారోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాసరావు 7 లక్షల రక్షణ కిట్లు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారని, అందుబాటులో ఉండటానికి, వాటిని డాక్టర్లకు, సిబ్బందికి ఇవ్వడానికి ఎంతో తేడా ఉందని ధర్మాసనం గుర్తుచేసింది. డాక్టర్లు, సిబ్బందికి వాటిని పూర్తిస్థాయిలో అందజేయకపోవడం వల్లే వారు కూడా కరోనా బారిన పడుతున్నారంది. ఆసుపత్రుల్లో కరోనా రావడం లేదని, సిబ్బంది ఉంటున్న హాస్టళ్లలోనే వస్తోందని శ్రీనివాసరావు చెబుతుండటాన్ని ఎలా చూడాలని ప్రశ్నించింది. తమపై భౌతిక దాడుల గురించి జూనియర్‌ డాక్టర్లు నెత్తీనోరూ కొట్టుకుంటున్నా, వారి రక్షణ కోసం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. ఈ విషయంలో తాము గతంలో ఇచ్చిన ఆదేశంపై ఎందుకు స్పందించలేదంది. తమ ఆదేశాలను ఇలా ఉల్లంఘిస్తూ పోతే అందుకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది. కోర్టు హాళ్ల వద్ద ఎలా రక్షణ కల్పించారో, డాక్టర్లకు, ఆయా వార్డుల వద్ద అలానే రక్షణ కల్పించాలని తేల్చి చెప్పింది.

జిల్లాకో కరోనా ఆసుపత్రి ఏమైంది..?
ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) బీఎస్‌ ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రభుత్వం శక్తి వంచన లేకుండా చర్యలు తీసుకుంటోందని వివరించారు. రాబోయే 10 రోజుల్లో 50 వేల పరీక్షలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, తెలంగాణలో పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయని ధర్మాసనం తెలిపింది. ఒక్క రోజులోనే 200కి పైగా కేసు నమోదయ్యాయంటే కరోనా తీవ్రత ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చునంది. జిల్లాకో కోవిడ్‌ ఆసుపత్రి ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు ఎంత వరకు కార్యరూపం దాల్చాయని ప్రశ్నించింది. ఇప్పటికే ఆసుపత్రులను గుర్తించామని, ఇందుకు సంబంధించిన వ్యాజ్యంపై గురువారం విచారణ జరగనుందని ఏజీ వివరించారు.

కరోనాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొస్తున్నారో లేదో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇన్‌ప్లుయెంజాను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చినప్పుడు, కరోనాను ఎందుకు తీసుకురాకూడదని ప్రశ్నించింది. మే 16న ఇచ్చిన కరోనా బులిటెన్‌ అంతకుముందు రోజు ఇచ్చినట్లే ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. చైనాలో రక్షణ శాఖ వైద్యుల సాయంతో అతి తక్కువ సమయంలో ఆసుపత్రి నిర్మించారని, ఇక్కడ కూడా రక్షణ శాఖ వైద్యుల సాయం ఎందుకు తీసుకోవడం లేదని ధర్మాసనం ప్రశ్నించింది. తాము లేవనెత్తిన అన్ని అంశాలపై ప్రభుత్వం పూర్తి వివరణ ఇవ్వాలని అంటూ విచారణను గురువారానికి వాయిదా వేసింది. 

 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా