కేబినెట్‌ నిర్ణయాన్ని కోర్టు సమీక్షించొచ్చు..

15 Nov, 2019 01:37 IST|Sakshi

ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణ నిర్ణయంపై హైకోర్టు

కేబినెట్‌ నిర్ణయంపై నిశ్శబ్దం అపోహలకు తావిస్తోంది

ఆర్టీసీ అభిప్రాయం తెలుసుకోరా?

విచారణ 18కి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌ : ఆర్టీసీలో 5,100 రూట్లను ప్రైవేటీకరిస్తూ రాష్ట్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం గోప్యమని, ఈ విషయంలో పూర్తి ప్రక్రియ జరిగే వరకూ నిర్ణయాన్ని వెల్లడించకూడదంటూ ప్రభుత్వం పేర్కొనడంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మంత్రిమండలి నిర్ణయాన్ని తొక్కిపెట్టడం, నిశ్శబ్దంగా ఉండటం వల్ల ప్రజల్లో దురభిప్రాయాలు, అపోహలు కలుగుతున్నా యని ధర్మాసనం అభిప్రాయపడింది. కేబినెట్‌ నిర్ణ యాన్ని ప్రజలు ప్రశ్నించవచ్చని, వాటిపై తాము న్యాయ సమీక్ష చేయవచ్చని స్పష్టం చేసింది. గతంలో ఎర్రమంజిల్‌ భవనం కేసులో మంత్రివర్గ నిర్ణయాన్ని రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేసింది. కేబినెట్‌ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.

ప్రజలు ఎందుకు ప్రశ్నించకూడదు...
ఈ సందర్భంగా అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదిస్తూ బస్సు రూట్ల ప్రైవేటీకరణపై కేబినెట్‌ తీసుకున్న నిర్ణయం తర్వాత మోటార్‌ వాహన చట్టం కింద గెజిట్‌ నోటిఫికేషన్, ఆ తర్వాత జీవో జారీ చేశాకే తర్వాతే ఎవరికైనా ప్రశ్నించే హక్కు వస్తుంద న్నారు. కేబి నెట్‌ నిర్ణయా నికి సంబంధించిన పత్రాలను సీల్డ్‌ కవర్‌లో ధర్మాసనానికి అందజేశారు. ఆ ప్రక్రియ పూర్తి చేసేందుకు స్టే అడ్డంకిగా ఉందని, సమాచార హక్కు చట్ట నిబంధనల ప్రకారం కూడా మంత్రిమండలి నిర్ణయ పత్రాలు ఇవ్వడానికి వీల్లేదన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ పత్రికల్లో వచ్చిన వార్తలే తమకు తెలుసునని, అంతకు మించి ఏమీ తెలియదని పేర్కొంది. అయినా ప్రజల కోసం కేబినెట్‌ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని ప్రజలు ఎందుకు ప్రశ్నించకూడదో వివరించాలని ఏజీని కోరింది. దీనిపై ఏజీ వాదిస్తూ కేబినెట్‌ ఏ నిర్ణయం తీసుకున్నా సవాల్‌ చేయకూడదని, సహకార చట్టంలోని 8 (1) ప్రకారం మంత్రిమండలి నిర్ణయానికి రక్షణ ఉందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఎర్రమంజిల్‌ హెరిటేజ్‌ భవనాన్ని కూల్చి అక్కడ చట్టసభల సముదాయ భవనాల్ని నిర్మించాలని కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేసిన కేసులో ఇదే హైకోర్టు ఆ నిర్ణయం చెల్లదని తీర్పు చెప్పిందని గుర్తుచేసింది. కేబినెట్‌ ఒక నిర్ణయం తీసుకొని రెండేళ్లపాటు గెజిట్‌/జీవోలు ఇవ్వకుంటే అప్పుడు ఏం చేయాలో చెప్పాలని ఏజీని కోరింది. కేబినెట్‌ నిర్ణయాలను సవాల్‌ చేయవచ్చునని, అలాంటి కేసుల్లో హైకోర్టు తగిన ఉత్తర్వులు ఇవ్వొచ్చని తేల్చిచెప్పింది. మంత్రిమండలి నిర్ణయం రహస్యమని చెబుతున్నప్పుడు పిటిషనర్‌ ఊహాగానాలతో హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారని ప్రభుత్వం తరఫున ఎలా చెబుతారని, ఆ విధంగా చెప్పే హక్కు ఎక్కడిదని ప్రశ్నించింది.

గుర్రానికి బదులు ముందే బండిని కట్టేస్తారా..?
ధర్మాసనం వ్యాఖ్యలపై ఏజీ స్పందిస్తూ కేబినెట్‌ నిర్ణయాల్ని రహస్యంగా ఉంచాలని, ఆ నిర్ణయానికి అనుగుణంగా జీవో వచ్చాకే ప్రక్రియ పూర్తయినట్లని చెప్పారు. ఆర్టీసీ చట్టంలోని 67 (3) ప్రకారం ప్రభుత్వం సవరణలు చేయవచ్చని ఏజీ చెప్పగానే ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఆ నిబంధనల ప్రకారం జీవో జారీ చేయాలని ఏమీ లేదని తెలిపింది. అయితే కేబినెట్‌ నిర్ణయం తర్వాత ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణ కూడా చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాతే ప్రక్రియ తుది దశకు వస్తుందని ఏజీ బదులిచ్చారు. కేబినెట్‌ నిర్ణయం ఆర్టీసీ చట్టంలోని సెక్షన్‌ 102కు అనుగుణంగా తీసుకున్నట్లుందని, అయితే ఆ నిర్ణయమే ఆ సెక్షన్‌కు వ్యతిరేకంగా ఉందని ధర్మాసనం తెలిపింది. అమల్లో ఉన్న పథకాన్ని మార్పు చేయాలంటే ఆ సెక్షన్‌ కింద చేసేందుకు వీలుంటుందని చెప్పింది. ఆర్టీసీ రూట్లలో కొన్నింటిని ప్రైవేటీకరించాలన్న నిర్ణయానికి ముందు ఆర్టీసీ కార్పొరేషన్‌ను ఆహ్వానించి అభిప్రాయాలు స్వీకరించాలని, అయితే ఇక్కడ ఆర్టీసీకి బదులు రోడ్డు ట్రాన్స్‌పోర్టు అథారిటీకి (ఆర్‌టీఏ) ఉత్తర్వులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. దీనిపై ఏజీ వాదిస్తూ సెక్షన్‌ 102 కింద అథారిటీనే అవన్నీ చూసుకుంటుందన్నారు. దీనిపై ధర్మాసనం కల్పించుకొని ఆర్టీసీ బస్సుల ప్రైవేటీకరణ తీర్మానాన్ని 102 సెక్షన్‌ కింద చేయడమంటే గుర్రాన్ని కట్టడానికి ముందే బండిని కట్టినట్లు ఉందని వ్యాఖ్యానించింది. ప్రైవేటీకరణ ప్రతిపాదన గురించి ఆర్టీసీ కార్పొరేషన్‌ ఏం చెప్పదల్చుకుందో ముందుగా వినాలని, పోనీ ఆర్టీఏ అయినా ఆర్టీసీకి నోటీసు ఇచ్చిందా? అని ప్రశ్నించింది. అయితే హైకోర్టు స్టే ఉత్తర్వులు కారణంగా ఇవ్వలేకపోయామని ఏజీ జవాబు చెప్పారు. 

బెంచ్‌ వద్దకు వెళ్లిన ఏజీ, ఐఏఎస్‌ అధికారి...
ఈ దశలో ఆర్టీసీ తరఫున అదనపు అడ్వకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు ఏదో వివరించే ప్రయత్నం చేయబోతుంటే ధర్మాసనం కల్పించుకొని కేబినెట్‌ నిర్ణయాన్ని చదివి పూర్తి అవగాహన చేసుకొని వివరించాలని ఏజీని కోరింది. అయితే మంత్రిమండలి నిర్ణయాన్ని రహస్యంగా ఉంచాలని తాము చెబుతున్నందున బయటకు చెబితే పత్రికలు రాస్తాయని, కాబట్టి తమ వద్దకు వచ్చి వివరించాలని కోరింది. దీంతో ఏజీ బీఎస్‌ ప్రసాద్‌తోపాటు రవాణాశాఖ కమిషనర్‌ సందీప్‌కుమార్‌ సుల్తానియా ధర్మాసనం వద్దకు వెళ్లి న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. అనంతరం ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ఆర్టీసీ మొత్తాన్ని ప్రైవేటీకరిస్తున్నట్లుగా పిల్‌లో పేర్కొన్నారని, కానీ పాక్షికంగానే కాబట్టి అందుకు అనుగుణంగా సవరణ పిటిషన్‌ దాఖలు చేయాలని పిటిషనర్‌ను ఆదేశించింది. ఇందుకు అంగీకరించిన పిటిషనర్‌ 18వ తేదీ వరకు సమయం ఇవ్వడంతోపాటు అప్పటివరకు స్టే ఉత్తర్వులు కొనసాగించాలని కోరారు. అందుకు ధర్మాసనం అంగీకరించింది. మరోవైపు అద్దె బస్సుల లీజు టెండర్లను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణను ఈ నెల 18కి వాయిదా వేసిన ధర్మాసనం... సెప్టెంబర్‌ నెల జీతాలు చెల్లించాలని కోరుతూ తెలంగాణ జాతీయ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి హన్మంత్‌ దాఖలు చేసిన రిట్‌పై విచారణ ఈ నెల 19కి వాయిదా వేసింది. 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు