సీఐలకు పదోన్నతి నిబంధన సడలింపు సబబే : హైకోర్టు

18 Aug, 2018 02:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసే పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి కల్పించే నిబంధనను సడలించడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి ఇవ్వాలంటే కనీసం రెండేళ్లపాటు వారు అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ), ఇంటెలిజెన్స్, సీఐడీ వంటి విభాగాల్లో పనిచేయాలనే నిబంధనను తెలంగాణ హోం శాఖ సడలిస్తూ 2016లో జీవో 122, 2017లో జీవో 133లను జారీ చేయడాన్ని పలువురు ఇన్‌స్పెక్టర్లు హైకోర్టులో సవాల్‌ చేశారు. వీటిపై వాదప్రతివాదనల అనంతరం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. నిబంధన సడలింపు వెనుక దురుద్దేశాలు కనబడటం లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.

గతంలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం ఏసీబీ, సీఐడీ, ఇంటెలిజెన్స్‌ వంటి విభాగాల్లో తాము పనిచేసినా డీఎస్పీలుగా పదోన్నతి ఇవ్వడం లేదని, వీటిలో పనిచేయని ఇతర సీఐలకు డీఎస్పీలుగా పదోన్నతులు ఇస్తూ తమకు అన్యాయం చేస్తున్నారని ఇన్‌స్పెక్టర్ల తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై ప్రభుత్వం తరఫున ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్‌ ప్రతివాదన చేస్తూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో శాంతిభద్రతల విధుల నిమిత్తం పలువురు ఇన్‌స్పెక్టర్లు ఆయా విభాగాల్లో పనిచేయలేకపోయారని, అందరికీ న్యాయం చేయాలనే ఆ నిబంధనను ప్రభుత్వం సడలించిందని వివరించారు. దీంతో ధర్మాసనం ఆ వ్యాజ్యాలను కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.  

మరిన్ని వార్తలు