‘ఆహార భద్రత’ కింద నిషేధమా..?

19 Feb, 2017 01:36 IST|Sakshi
‘ఆహార భద్రత’ కింద నిషేధమా..?

పొగాకు ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్‌: ఆహార నిర్వచనం కింద పొగాకు ఉత్పత్తుల తయారీ, పంపిణీ, నిల్వ, అమ్మకాలపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఆహార భద్రత, ప్రమాణాల చట్టం కింద ఆహార భద్రత కమిషనర్‌ ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. పొగాకు ఉత్పత్తులకు ఆహార భద్రత, ప్రమాణాల చట్టం కింద నిషేధం ఎలా వర్తిస్తుందో వివరించాలంటూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి, రాష్ట్ర ఆహార, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆహార భద్రత కమిషనర్, డీజీపీ, కరీంనగర్‌ జిల్లా ఎస్‌పీ తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వారిని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 1కి వాయిదా వేసింది.

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం కింద రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తులపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఆహార భద్రత కమిషనర్‌ ఈ ఏడాది జనవరి 10న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ కరీంనగర్‌ జిల్లా ప్రకాశంగంజ్‌కు చెందిన శ్రీ వెంకటేశ్వర జనరల్‌ స్టోర్‌ యజమాని కె.కరణ్‌కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫున ఇ.మదన్‌మోహన్‌రావు వాదనలు వినిపిస్తూ... పొగాకు ఉత్పత్తులపై నిషేధం విధిస్తూ పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం కింద కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసిందని... సిగరెట్లు, చుట్టలు, బీడీలు తదితరాలు పొగాకు ఉత్పత్తుల పరిధుల్లోకి వస్తాయని పేర్కొందన్నారు. అయితే రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్‌ పొగాకు ఉత్పత్తుల తయారీ, నిల్వ, పంపిణీ, అమ్మకాలపై ఏడాది పాటు నిషేధం విధిస్తూ ఆహార భద్రతా చట్టం కింద నోటిఫికేషన్‌ ఇచ్చారని తెలిపారు. గతేడాది కూడా ఇదే విధంగా నోటిఫికేషన్‌ జారీ చేయగా, దానిపై హైకోర్టు స్టే ఇచ్చిందన్నారు.

>
మరిన్ని వార్తలు