దర్గా భూములు సేకరించే ప్రతిపాదన వచ్చిందా?

28 Mar, 2018 03:46 IST|Sakshi

వక్ఫ్‌బోర్డ్‌కు హైకోర్టు ప్రశ్న 

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రిజర్వాయర్‌ కోసం నిజామాబాద్‌ మంచిప్పలోని దర్గాకు చెందిన భూముల సేకరణ విషయంలో ప్రభుత్వం నుంచి ప్రతిపాదన వచ్చిందో లేదో చెప్పాలని హైకోర్టు మంగళవారం వక్ఫ్‌బోర్డుకు స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

మంచిప్ప, కొండం చెరువులను కలుపుతూ నిర్మిస్తున్న రిజర్వాయర్‌ నిర్మాణం వల్ల నిజామాబాద్‌లో ఉన్న 400 సంవత్సరాల నాటి దర్గా ముంపునకు గురవుతోందని, ఈ దర్గా పరిరక్షణకు చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ సొసైటీ ఫర్‌ ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రెస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ హైకోర్టులో పిల్‌ దాఖలు చేసింది. దీనిపై మంగళవారం విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది రచనారెడ్డి వాదనలు వినిపిస్తూ.. రిజర్వాయర్‌ కోసం దర్గాకు చెందిన భూములను ప్రభుత్వం సేకరిస్తోందని పేర్కొన్నారు. దీనిపై వక్ఫ్‌బోర్డ్‌కు, ముఖ్యమంత్రికి, కేంద్ర జల వనరుల సంఘానికి పిటిషనర్‌ వినతిపత్రాలు సమర్పించారని, అయితే ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.   

మరిన్ని వార్తలు