వ్యభిచార రొంపి.. వెట్టి కూపంలోకి! 

7 Jan, 2020 02:09 IST|Sakshi

అదృశ్యమైన పిల్లలను బలవంతంగా నెడుతున్నారన్న హైకోర్టు

మానవ అక్రమ రవాణాపై ఎన్ని కేసులు నమోదయ్యాయి?

వివరాలు ముందుంచాలన్న కోర్టు

సాక్షి, హైదరాబాద్‌: పిల్లల అదృశ్యం కేసులను ఛేదించలేక పోలీసులు క్లోజ్‌ చేస్తే ఎలాగని హైకోర్టు ప్రశ్నించింది. అదృశ్యమైన ఆడపిల్లలు వ్యభిచార కూపంలోకి, బాలురు వెట్టిచాకిరీలోకి, మైనార్టీలనైతే ఉగ్రవాదం రొంపిలోకి బలవంతంగా నెట్టేస్తున్నారని ధర్మాసనం ఆవేదన వ్యక్తంచేసింది.  పిల్లల అదృశ్యం కేసుల్ని పోలీసులు తగిన రీతిలో పట్టించుకోవడం లేదని దాఖలైన పిల్‌పై విచారణ సందర్భంగా ధర్మాసనం.. అదృశ్యమైన పిల్లలకు ఉగ్రవాదంలో తర్ఫీదు ఇచ్చి తిరిగి వాళ్లను దేశంపైకి వదిలితే ఎదురయ్యే ప్రమాదకర పరిస్థితుల్నీ పోలీసులు అంచనా వేయాలని హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతమంది పిల్లలు అదృశ్యమయ్యా రో, వారిలో ఎవరినైనా అక్రమ రవాణా చేశారా, మానవ అక్రమ రవాణాపై ప్రభుత్వ విధానం ఏంటో తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దీనికి సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యా యో, ఎన్ని కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేశారో, ఎంతమందిని రక్షించారో తెలపాలంది. మానవ అక్రమ రవాణాలో ఇతర రాష్ట్రాల పిల్లలుంటే ప్రభుత్వం వారి విషయంలో ఏవిధంగా చేస్తోందో తెలపాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పిల్లల అదృశ్యం కేసుల్ని పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే పోలీసులు క్లోజ్‌ చేస్తున్నారని న్యాయవాది రాపోలు భాస్కర్‌ దాఖలు చేసిన పిల్‌ను ధర్మాసనం సోమవారం విచారించింది. పూర్తి వివరాలతో వచ్చే నెల 6లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని, అదే నెల 10న తిరిగి విచారణ చేస్తామని పేర్కొంది.

పిల్లల బాధలు వర్ణనాతీతం.. 
రాజస్తాన్‌లో అదృశ్యమైన వారిలో సగం మంది బాలికలేనని, అందులో 12 నుంచి 18 ఏళ్ల మధ్య వయసు వారేనని విచారణలో ధర్మాసనం చెప్పింది. రాజస్తాన్‌కు చెందిన యువతులు గుజరాత్‌లో పట్టుబడితే ఉద్యోగాల కోసం వచ్చారని చెప్పారని, నిజానికి వారందరినీ వ్యభిచారకూపంలోకి నెట్టేశారని ఆవేదనతో వ్యాఖ్యానించింది. వ్యభిచార గృహాలపై ప్రభుత్వం దాడులు చేస్తే అమాయక యువతులను బయటపడేయవచ్చని సూచించింది.  వీరి బాధలు వర్ణనాతీతంగా ఉంటే కన్నవారి మనోవేదన దారుణంగా ఉందని  పేర్కొంది.

గుట్టలో పరిస్థితులు అదుపులోకి తెచ్చాం.. 
ప్రభుత్వ న్యాయవాది శ్రీకాంత్‌రెడ్డి వాదిస్తూ.. యాదగిరిగుట్టలోని పలు వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసి అక్కడి పరిస్థితులను అదుపులోకి తెచ్చామని తెలిపారు. ప్రజ్వల అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిల్‌ను ప్రస్తుత వ్యాజ్యంతో కలిపి ఫిబ్రవరి 10న విచారిస్తామని ధర్మాసనం తెలిపింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా