సీట్లు ఖాళీగా ఉంటే సర్కారుకెందుకు బాధ?

11 Feb, 2018 04:13 IST|Sakshi

ఫార్మా–డీ కోర్సుపై హైకోర్టు

ఎన్‌ఓసీ ఇవ్వాలని జేఎన్‌టీయూ–హెచ్‌కు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ విధాన నిర్ణయం పేరుతో సాంకేతిక విద్యాసంస్థల్లో కొత్త కోర్సులకు నిరభ్యంతర ధ్రువపత్రం (ఎన్‌ఓసీ) ఇవ్వకపోవడం సబబు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో లక్ష్మీబాయి విద్యాపీఠం నిర్వహిస్తున్న బొజ్జల నర్సింహులు మహిళా ఫార్మసీ కాలేజీలో 2018–19 విద్యాసంవత్సరంలో ఫార్మాడీ కోర్సును ప్రారంభించేందుకు వీలుగా ఎన్‌ఓసీ మంజూరు చేయాలని జేఎన్‌టీయూ–హెచ్‌ను హైకోర్టు ఆదేశించింది.

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది. ఫార్మా–డీ విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతున్న అంశాన్ని ధర్మాసనం గుర్తు చేసింది. సీట్లు భర్తీ కాకపోతే సంబంధిత కాలేజీ బాధపడాలే గానీ ఆ బాధను ప్రభుత్వమే తనపై వేసుకుని ఎన్‌ఓసీ ఇవ్వకపోవడం సబబు కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇంజనీరింగ్‌ విద్యలో ఉన్న పరిస్థితులను ఫార్మా–డీ కోర్సుకు వర్తింపజేయడం సముచితంగా లేదని పేర్కొంది. ఏఐసీటీఈ, పీసీఐ అనుమతిచ్చినా తమ కాలేజీలో ఫార్మా–డీ కోర్సు ప్రారంభానికి అనుబంధ గుర్తింపు ఇవ్వడం లేదని ఆ కాలేజీ హైకోర్టును ఆశ్రయించింది. ఫార్మా–డీ సీట్లు ఏటా ఖాళీలు ఉన్నాయంటూ సర్కార్‌తోపాటు జేఎన్‌టీయూ–హెచ్‌ చేసిన వాదనల్ని ధర్మాసనం తిరస్కరించింది.

మరిన్ని వార్తలు