‘కిన్లే’ బాటిళ్ల అప్పగింతకు హైకోర్టు నిరాకరణ

14 Aug, 2018 01:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర తూనికలు, కొలతల శాఖ సీజ్‌ చేసిన లక్ష మంచినీటి బాటిళ్లను కిన్లే కంపెనీకి అప్పగించేందుకు హైకోర్టు ధర్మాసనం నిరాకరించింది. గత ఏప్రిల్‌ 2న తూనికలు, కొలతల శాఖ అధికారులు మెదక్‌ జిల్లా, పాశమైలారంలోని హిమజల్‌ బేవరేజెస్‌లో తనిఖీలు నిర్వహించారు. కిన్లే బాటిళ్లపై వినియోగదారులు ఫిర్యాదులు చేయాల్సిన వ్యక్తి పేరు, చిరునామా, ఫోన్‌ నంబర్‌ లేవంటూ లక్ష బాటిళ్లను అధికారులు జప్తు చేశారు. వీటిని వెంటనే తమకు అప్పగించేందుకు ఆదేశించాలని కిన్లే కంపెనీ హైకోర్టును ఆశ్రయించింది.

ఈ వ్యాజ్యం విచారణకు వచ్చిన సందర్భంగా సింగిల్‌ జడ్జి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు అధికారుల తీరును తప్పుబట్టారు. ఫిర్యాదు చేయాల్సిన టోల్‌ ఫ్రీ నంబర్, ఈ మెయిల్‌ అడ్రస్‌ ఉన్నాయని, వ్యక్తి పేరు లేదన్న కారణంతో జప్తు చేయడం సరికాదన్నారు. జప్తు చేసిన బాటిళ్లను కంపెనీకి అప్పగించాలని తూనికలుకొలతల శాఖ, అధికారులను ఆదేశించారు. దీన్ని సవాల్‌ చేస్తూ తూనికలుకొలతల శాఖ, హైకోర్టు ధర్మాసనం ఎదుట అప్పీల్‌ చేయగా సోమవారం విచారణకు వచ్చింది.

ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ జరపాల్సివుందని, ఈ దశలో బాటిళ్లను అప్పగించేందుకు ఉత్తర్వులు ఇవ్వలేమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. జప్తును ఎత్తివేయాలన్న కంపెనీ తరఫు న్యాయవాది అభ్యర్థనపై స్పందిస్తూ.. వినియోగదారుడు డబ్బు పెట్టి కొనుగోలు చేసిన మంచినీటి బాటిల్‌లోని నీరు ఎక్కడి నుంచి సేకరించారో తెలుసుకునే హక్కు వారికి ఉందని, మూసీ నీటినే శుద్ధి చేసి ఇస్తున్నారో, వేరే ఎక్కడి నుంచి తెస్తున్నారో తెలియాలి కదా.. అని వ్యాఖ్యానించింది. వాదనల అనంతరం ధర్మాసనం విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేస్తూ సీజ్‌ చేసిన బాటిళ్లను విడుదల చేయరాదని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా