జగతి పబ్లికేషన్స్‌కు హైకోర్టు ఊరట

10 Mar, 2017 02:12 IST|Sakshi

ఈ నెల 17 వరకు అభియోగాల నమోదు వద్దంటూ సీబీఐ కోర్టుకు ఆదేశం
సాక్షి, హైదరాబాద్‌: జగతి పబ్లికేషన్స్‌కు ఉమ్మడి హైకోర్టులో ఊరట లభించింది. జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఈ నెల 17వ తేదీ దాకా ఎలాంటి అభియోగాల నమోదు ప్రక్రియా చేపట్టొద్దని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానాన్ని హైకోర్టు ఆదేశించింది. న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.సీతారామమూర్తి ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. సీబీఐ నమోదు చేసిన కేసుల్లో ఒకేసారి అభియోగాల నమోదు చేపట్టేందుకు నిరాకరిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ జగతి పబ్లికేషన్స్‌ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే.

 వీటిపై న్యాయమూర్తి గురువారం మరోసారి విచారణ జరిపారు. వేర్వేరుగా అభియోగాల నమోదు ప్రక్రియ చేట్టడం వల్ల తమకు కలిగే నష్టాన్ని జగతి పబ్లికేషన్స్‌ తరఫున సీనియర్‌ న్యాయవాదులు టి.నిరంజన్‌రెడ్డి, డి.వి.సీతారామ్మూర్తి ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. తరువాత సీబీఐ తరఫు న్యాయవాది పి.కేశవరావు వాదనలు వినిపిస్తూ ఈ వ్యాజ్యాలకు విచారణార్హత లేదన్నారు. ఈ వ్యాజ్యాలపై విచారణకు సమయం పడుతున్నందున వారం పాటు అభియోగాల నమోదు ప్రక్రియను నిలిపేస్తే అభ్యంతరమేమైనా ఉందా అని న్యాయమూర్తి ప్రశ్నించారు. వారం పాటైతే అభ్యంతరం లేదని కేశవరావు పేర్కొనడంతో 17 వరకు అభియోగాల నమోదు ప్రక్రియ చేపట్టవద్దని ఆదేశించారు. విచారణను ఈ నెల 14కు వాయిదా వేశారు. వ్యాజ్యాలన్నింటినీ రెగ్యులర్‌ కోర్టు ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

మరిన్ని వార్తలు