రిజర్వేషన్ల రోస్టర్‌ ప్రకటించకపోవడం తప్పే

2 Aug, 2018 01:35 IST|Sakshi

ఉర్దూ అధికారుల పోస్టుల భర్తీపై హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: ఉర్దూ అధికారులు గ్రేడ్‌–1, గ్రేడ్‌–2 పోస్టుల భర్తీ సమయంలో రిజర్వేషన్ల కోటాను పేర్కొనకుండా భర్తీ ప్రకటన జారీ చేయడం చట్ట వ్యతిరేకమనే అభిప్రాయాన్ని హైకోర్టు వ్యక్తం చేసింది. అందుకే ఈ కేసులో ఇప్పటికే గ్రేడ్‌–2 పోస్టుల ఫలితాలు వెలువడినందున ఆ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను ప్రతివాదులుగా చేర్చాలని పిటిషనర్‌ను ఆదేశించినట్లు న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావు వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రోస్టర్‌ విధానాన్ని అమలు చేయకపోవడం తప్పుకాక ఏమవుతుందని ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ను నిలదీశారు.

ఉద్యోగ భర్తీ ప్రకటనలో రిజర్వేషన్ల ప్రక్రియను ఎందుకు పేర్కొనలేదో వివరించాలని ఉర్దూ అకాడమీని ఆదేశించా రు. పూర్తి వివరాలతో అదనపు కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేస్తామని, అందుకు గడువు కావాలని ఉర్దూ అకాడమీ తరఫు న్యాయవాది కోరారు. అందుకు అనుమతించిన న్యాయమూర్తి తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేశారు. కాగా, మైనార్టీ సంక్షేమ శాఖలోని ఉర్దూ అకాడమీ డైరెక్టర్‌ గత మార్చి 28న గ్రేడ్‌–1, గ్రేడ్‌–2లకు చెందిన 60 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేశారు.

ఈ పోస్టుల భర్తీలో రిజర్వేషన్లను అమలు చేయకపోవడం చెల్లదని, సర్వీస్‌ కమిషన్‌ ద్వారా కాకుండా నేరుగా ఉర్దూ అకాడమీ పోస్టుల భర్తీ ప్రకటన విడుదల చేయడం చట్ట వ్యతిరేకమని పేర్కొంటూ మహ్మద్‌ ముత్తాబి అలీఖాన్‌ ఇతరులు హైకోర్టులో వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. సర్వీస్‌ రూల్స్‌లోని 22వ నిబంధన ప్రకారం రోస్టర్‌ విధానాన్ని అమలు చేయాలని, ఈ భర్తీ ప్రకటన చెల్లదని పిటిషనర్ల వాదన. గ్రేడ్‌–2 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయడంతో వారి వాదన వినా ల్సి ఉందని, కాబట్టి వారందరినీ ప్రతివాదులుగా చేయాలని గత విచారణ సమయంలో పిటిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.

బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. ఉర్దూ అకాడమీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. రోస్టర్‌ ప్రకటించకపోవడం చిన్నపాటి తప్పిదమన్నారు. రోస్టర్‌ ప్రకటించకపోవడం చిన్న తప్పు కాదని, పెద్ద తప్పిదమేనని న్యాయమూర్తి అన్నారు. ఎంపికైన అభ్యర్థులను ప్రతివాదులుగా చేర్చడంపై న్యాయవాది అభ్యంతరం చెప్పగా, ఎంపికయ్యారు కాబట్టే వారి వాదన వినా ల్సి ఉంటుందని, అందుకే ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశించామని, సమగ్ర విచారణ జరపాల్సి ఉందని న్యాయమూర్తి తేల్చి చెప్పారు.

మరిన్ని వార్తలు