ఏపీ డీజీపీ పార్కు ఆక్రమణ నిజమే! 

6 Mar, 2019 04:02 IST|Sakshi

హైకోర్టుకు నివేదించిన జీహెచ్‌ఎంసీ

ఆక్రమించుకునేంత వరకు ఏం చేస్తున్నారు? 

జీహెచ్‌ఎంసీపై నిప్పులు చెరిగిన హైకోర్టు 

ఠాకూర్‌ నిర్మాణాలపై 11 వరకు స్టేటస్‌ కో 

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ డీజీపీ రామ్‌ ప్రవేశ్‌ ఠాకూర్‌ (ఆర్పీ ఠాకూర్‌) హైదరాబాద్‌లోని ప్రశాసన్‌నగర్‌లో జీహెచ్‌ఎంసీకి చెందిన పార్కు భూమిని ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవమేనని జీహెచ్‌ఎంసీ న్యాయవాది ఎల్‌.వెంకటేశ్వరరావు హైకోర్టుకు నివేదించారు. తాము నోటీసు జారీ చేసిన తరువాత పార్కులో చేపట్టిన అక్రమ నిర్మాణాలను తొలగించారని వివరించారు.  అనుమతి పొందిన ప్లాన్‌ కు విరుద్ధంగా ఇంటి నిర్మాణాలు చేపడుతుండటంపై కూడా నోటీసులు జారీ చేశామన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, జీహెచ్‌ఎంసీపై నిప్పులు చెరిగింది.

పార్కును అక్రమించుకునేంత వరకు ఏం చేస్తున్నారని ప్రశ్నిం చింది. అనుమతి పొందిన ప్లాన్‌కు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే ఎక్కడున్నారంటూ నిలదీసింది. అక్రమ నిర్మాణాల విషయంలో తప్పుపట్టాల్సింది అవి చేపడుతున్న వారిని కాదని, చోద్యం చూస్తున్న జీహెచ్‌ఎంసీ అధికారులనంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. పీకలకు చుట్టుకుంటుందని అనుకున్నప్పుడే స్పందించడం జీహెచ్‌ఎంసీ అధికారులకు అలవాటుగా మారిందని వ్యాఖ్యానించింది. అక్రమ నిర్మాణా ల విషయంలో ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారో తమకు అర్థం కాకుండా ఉందంది.

24 గంటల్లో ఆక్రమణలను తొలగించాలని, లేకుంటే కూల్చివేస్తామంటూ చెప్పడం అలవాటుగా మారిందంది. నోటీసు ఇచ్చినప్పుడు దానికి స్పందిం చేందుకు వారం రోజు ల గడువునివ్వాలని సుప్రీంకోర్టు తీర్పులిచ్చిందని గుర్తు చేసింది. ఈ కేసులో కూడా డీజీపీ ఠాకూర్‌కు 24 గంటల సమయం ఇవ్వడాన్ని తప్పు పట్టింది. ఠాకూర్‌ అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకునే విషయంలో యథాతథస్థితిని (స్టేటస్‌ కో) కొనసాగించాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ల ధర్మాసనం మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  

ఠాకూర్‌ అక్రమ నిర్మాణాలపై ఆళ్ల పిల్‌... 
ప్రశాసన్‌నగర్‌లో ఆర్‌పీ ఠాకూర్‌ జీహెచ్‌ఎంసీ పార్కును ఆక్రమించుకుని, అనుమతి పొందిన ప్లాన్‌కు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని.. దీనిపై జీహెచ్‌ఎంసీ అధికారులు నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకున్నారంటూ ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం విచారణ జరపాల్సి ఉంది. అయితే సీజే అకస్మాత్తుగా సెలవు పెట్టారు. దీంతో ఈ వ్యాజ్యంపై అత్యవసర విచారణ చేపట్టాలని ఠాకూర్‌ తరఫు న్యాయవాది వి. పట్టాభి మంగళవారం ఉదయం జస్టిస్‌ చౌహా న్‌ నేతృత్వంలోని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. దీనికి అంగీకరించిన ధర్మాసనం విచారణ చేపట్టింది.  

అక్రమ నిర్మాణాలపై ఏం చర్యలు తీసుకున్నారు? 
పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి. సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, డీజీపీ ఠాకూర్‌ అక్రమ నిర్మాణాలను కొనసాగిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని చెప్పారు. 2017లో అక్ర మ నిర్మాణాలను చేపట్టిన ఠాకూర్, ఈసారి పార్కునే ఆక్రమిం చి నిర్మాణాలు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ, ఠాకూర్‌ అక్రమ నిర్మాణాలపై ఏం చర్యలు తీసుకున్నారని జీహెచ్‌ఎంసీ వివరణ అడిగింది. జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది ఎల్‌.వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. అక్రమ నిర్మాణాలకు సంబంధించి నోటీసు జారీ చేశామని, సమాధానం రాకపోవడంతో మరో నోటీసు జారీ చేశామన్నారు. ఈ నోటీసులపై ఆయన కింది కోర్టుకెళ్లి, ఇన్‌జంక్షన్‌ ఉత్తర్వులు పొందారని తెలిపారు. కింది కోర్టు ఇటీవల ఆయన పిటిషన్‌ను కొట్టేసిందని చెప్పారు. దీంతో మళ్లీ ఈ నెల 2న తుది నోటీసు జారీ చేసి, 24 గంటల్లో అక్రమ నిర్మాణాలను తొలగించాలని, లేకపోతే తామే వాటిని కూల్చివేస్తామని స్పష్టం చేశామని చెప్పారు.  

ఆక్రమించుకుంటుంటే ఏం చేస్తున్నారు..
నోటీసు ఇచ్చినప్పుడు, దానికి స్పందించేందుకు గడువు ఏడు రోజులు ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ధర్మాసనం గుర్తు చేసింది. ఠాకూర్‌కు 24 గంటలే గడువునివ్వడం సరికాదంది. ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తున్నామంది. కూల్చివేత విషయంలో యథాతథస్థితిని కొనసాగించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా ధర్మాసనం జీహెచ్‌ఎంసీపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎవరో గుచ్చినప్పుడు కోమా లో నుంచి బయటకు వచ్చి హడావుడి చేస్తుంటారని మండి పడింది. ఈ పిటిషన్‌ దాఖలు కాకుండా ఉంటే, ఆ పార్కు సంగతి ఏమిటని నిలదీసింది. తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఈ కేసులో ఠాకూర్‌ నుంచి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు 2 వారాల గడువు కావాలని పట్టాభి కోరగా ధర్మాసనం తోసిపుచ్చింది.  

మరిన్ని వార్తలు