ప్లకార్డులు పట్టుకుంటే సరిపోదు

31 Oct, 2018 02:19 IST|Sakshi

ఎన్నికలప్పుడు మాట్లాడితే బాధ్యత తీరదు

ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలకు హైకోర్టు చీవాట్లు

లైసెన్సులు లేకుండా రక్షిత గృహాలను నిర్వహిస్తుంటే ఏం చేస్తున్నారు?

సాక్షి, హైదరాబాద్‌ :  ‘సంక్షేమ కార్యక్రమాల గురించి ఎన్నికలప్పుడు ప్లకా ర్డులు పట్టుకుంటే సరిపోదు. ఎన్నికల సమయంలోనే సంక్షే మ పథకాల గురించి మాట్లాడితే బాధ్యత తీరిపోదు. ఆ పథకాలు ఎలా అమలవుతున్నాయి, లోటుపాట్లు ఏమిటి.. ఆ కార్యక్రమ ప్రయోజనాలు లబ్ధిదారులకు అందుతున్నా యా.. తదితర విషయాలను పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. పథకాల అమలుపై పెర్ఫార్మెన్స్‌ ఆడిట్‌ నిర్వహించాలి. అప్పుడే ఆ పథకాల లక్ష్యం నెరవేరుతుంది.’     –ఉభయ రాష్ట్రాలను ఉద్దేశించి హైకోర్టు ధర్మాసనం వ్యాఖ్య

ఉభయ రాష్ట్రాల్లో యువతులు, మహిళలు, వృద్ధుల కోసం లైసెన్సులు తీసుకోకుండానే రక్షిత గృహాలు నిర్వహిస్తుంటే ఏం చేస్తున్నారని హైకోర్టు మంగళవారం ఉభయ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నించింది. లైసెన్సుల్లేని రక్షిత గృహాల నిర్వాహకులపై ఏం చర్యలు తీసుకున్నారని నిలదీసింది. రక్షిత గృహాలకు లైసెన్సులు లేవని ఎవరో చెబితే తప్ప తెలుసుకోలేని దుస్థితిలో ఉన్నారా? అంటూ నిలదీసింది. దీనిపై వివరాలను తమ ముందు ఉంచాలని రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

విచారణను నవంబర్‌ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ టి.బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.వి.భట్‌ల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. మను షుల అక్రమ రవాణా నిరోధక చట్టంలోని నిబంధనలను కఠినంగా అమలు చేసేలా ఆదేశాలు జారీ చేయడంతో పాటు లైంగిక దాడులకు గురైన మహిళల రక్షణకు రక్షిత గృహాలను ఏర్పాటు చేసేలా ఆదేశాలివ్వాలంటూ స్వచ్ఛం ద సంస్థ ప్రజ్వల హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీన్ని పలుమార్లు విచారించిన సీజే నేతృత్వం లోని ధర్మాసనం మంగళవారం మరోసారి విచారించింది.

ఎన్నికల సమయంలో చెబితే సరిపోదు..
లైసెన్సులు లేకుండా రక్షిత గృహాలను నిర్వహిస్తుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. కమిటీలు ఏర్పాటు చేశామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు చెప్పగా, ఇది రొటీన్‌ సమాధానం అయిపోయిందని వ్యాఖ్యానించింది.  సంక్షేమ కార్యక్రమాల గురించి ఎన్నికలప్పుడు చెబితే సరిపోదని, వాటిపై ప్లకార్డులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు మౌనంగా నిల్చుని ఉండటంతో, ప్రోగ్రెస్‌ కార్డులు పట్టుకుని తల్లిదండ్రుల ముందు నిలబడ్డ పిల్లల్లా నిల్చున్నట్లు ఉందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు