రేవంత్‌ అరెస్టుపై హైకోర్టు ఆగ్రహం

5 Dec, 2018 15:49 IST|Sakshi

సీల్‌ లేకుండా రిపోర్టు ఇవ్వడం పట్ల డీజీపీపై కోర్టు సీరియస్‌

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గిలో కేసీఆర్‌ పాల్గొనకుండా అడ్డుకుంటానని ప్రకటించిన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిని మంగళవారం వేకువజామున పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై రాష్ట్ర హైకోర్టు పోలీసుల చర్యను తప్పుబట్టింది. ‘కేసీఆర్‌ సభకు రేవంత్‌ ఆటంకం కలిగిస్తాడనే సమాచారం ఉన్నప్పుడు పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలి కదా..! ఎలాంటి వారెంట్‌ లేకుండా అర్ధరాత్రి ఎలా అరెస్టు చేస్తారు..? కోర్టుకు అందించిన ఇంటలిజెన్స్‌ రిపోర్టుకు ఎలాంటి సీల్‌ లేకపోవడమేంటి. సీల్‌ లేకుండా రిపోర్టులు ఎలా ఇచ్చారు’ అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 

సీల్‌ లేకుండా రిపోర్టు ఇవ్వడంతో పోలీస్‌ రైట్స్‌ మిస్‌యూజ్‌ కాలేదనడానికి రుజువేంటని హైకోర్టు డీజీపీ మహెందర్‌ రెడ్డిని ప్రశ్నించింది. కోర్టు వ్యాఖ్యలపై స్పదించిన డీజీపీ తమ వద్ద సీల్‌ ప్రాసెస్‌ లేదని కోర్టుకు తెలిపారు. ‘ఇలాంటి పేపర్‌ రిపోర్టులను ఎవరైనా, ఎక్కడైనా తయారు చేయవచ్చు’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలతో రెండు వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని అడ్వకేట్‌ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు తెలిపింది.

మరిన్ని వార్తలు