కాళేశ్వరం ప్రాజెక్టుకు హైకోర్టు అనుమతులు

8 Nov, 2017 20:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ బుధవారం ఉమ్మడి రాష్ట్రాల హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పర్యావరణానికి హానీ కలించకుండా ప్రాజెక్టు పనులు కొనసాగించాలని ప్రభుత్వానికి న్యాయస్థానం సూచించింది. 

అనుమతులు లేకుండా ప్రభుత్వం అటవీ ప్రాంతంలో పనులు చేపట్టరాదని.. అయితే తాగునీటి ప్రాజెక్టుల విషయంలో సడలింపు ఇస్తున్నట్లు తెలిపింది. తాగునీటి అవసరాలకు మాత్రమే ప్రాజెక్టును ఉపయోగించాలని చెప్పింది. పిటిషనర్‌కు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చునని చెప్పింది. 

అనుమతులు లేకుండానే ప్రాజెక్టును చేపట్టారని పేర్కొంటూ.. పలువురు నిర్వాసితులు గ్రీన్‌ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించారు. విచారణ జరిపిన ట్రైబ్యునల్‌ పర్యావరణ అనుమతులు తీసుకోలేదని చెబుతూ పనులు నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించగా.. పనులు కొనసాగించుకోవచ్చని కోర్టు తీర్పు ఇచ్చింది. కాగా,  80 వేల కోట్ల భారీ బడ్జెట్‌తో 15 కొత్త జిల్లాల పరిధిలోని దాదాపు 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రతిష్ఠాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన విషయం తెలిసిందే. 

పరిహారంగా 722 కోట్లు...

ప్రాజెక్టు భూ సేకరణకు పరిహారంగా నిధుల జమకు ప్రభుత్వ అనుమతిస్తూ ఆదేశాలు జారీచేసింది. 3,168 హెక్టార్ల అటవీభూమి వినియోగానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా అటవీ భూములకు పరిహారంగా రూ. 722.30 కోట్లు జమ చేసేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రూ. 704.37 కోట్లను కంపా(కంపెన్సెటరీ అండ్ ఎఫారెస్టెషన్ మేనేజ్‌మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ) ఖాతాకు, అదేవిధంగా మిగిలిన రూ. 17.92 కోట్లను జిల్లా అటవీ అధికారుల వద్ద జమ చేయాలని ఆదేశించింది. 

మరిన్ని వార్తలు