‘క్రీడల కోటా’లో సర్కారుకు షాక్‌

30 Aug, 2018 01:15 IST|Sakshi

వైద్య విద్య క్రీడల కోటా ప్రవేశాల జీవో 7ను రద్దు చేసిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: క్రీడల కోటా జాబితా విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. మెడికల్, డెంటల్‌ కోర్సుల్లో 2018–19 విద్యా సంవత్సరానికి క్రీడల కోటా కింద ప్రవేశాల కోసం ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌ 21న జారీ చేసిన జీవో 7ను హైకోర్టు కొట్టేసింది. వైద్య విద్యలో క్రీడల కోటా కొందరి ధనార్జనకు ఉపయోగపడుతోందని, అలాంటి కోటాను రద్దు చేస్తే క్రీడా, వైద్య రంగాలకు మేలు చేసినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి పతకాలు రానప్పుడు, నైపుణ్యం ప్రదర్శించలేనప్పుడు, కొందరు వ్యక్తుల ధనార్జన కోసం క్రీడల కోటా కొనసాగించడంలో అర్థం లేదంది. సామాజిక, రాజకీయ కారణాల చేత కోటా రద్దు నిర్ణయం తీసుకోలేని పక్షంలో కనీసం ఎప్పుడూ వినని క్రీడలను జాబితా నుంచి తొలగించి క్రీడలు ఆడకుండానే లబ్ధి పొందుతున్న వ్యక్తులకు అడ్డుకట్ట వేయాలంది.

తగిన మార్పులతో క్రీడల కోటాను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి వాటిని అమలు చేయాలని ఆదేశించింది. జీవో 334 ద్వారా ఏర్పాటు చేసిన కమిటీ లేదా మరో కమిటీని ఏర్పాటు చేసి అధ్యయం నిర్వహించి, ఆ తరువాత కోటా కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని తేల్చి చెప్పింది. రాష్ట్రంలో ఆడుతున్న ప్రధాన క్రీడలేంటి.. 14–18 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థులు ఎంత మంది వీటిని ఆడుతున్నారు.. ఈ క్రీడల్లో ఎన్నింటికి సంబంధిత క్రీడా సంస్థల గుర్తింపు ఉంది.. ఈ క్రీడల్లో ఎంత మంది విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రికార్డులు సాధించారు.. క్రీడల కోటా కింద వైద్య విద్యలో ప్రవేశాలు పొందిన వారిలో ఎంత మంది ఆ క్రీడల్లో కొనసాగుతున్నారు.. ఎంత మంది జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొన్నారు.. తదితర అంశాలపై అధ్యయనం నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్, జస్టిస్‌ జె.ఉమాదేవిల ధర్మాసనం తీర్పు వెలువరించింది.  

జూలై 6న మధ్యంతర ఉత్తర్వులు 
మెడికల్, డెంటల్‌ కోర్సుల్లో క్రీడల కోటా కింద ఈ విద్యా సంవత్సరం సీట్ల భర్తీకి కొన్ని మార్గదర్శకాలతో ప్రభుత్వం జారీ చేసిన జీవోను సవాలు చేస్తూ టి.శ్రియా మరో నలుగురు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన జస్టిస్‌ రామసుబ్రమణియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ ఏడాదికి క్రీడల కోటా కింద ప్రవేశాలు చేపట్టవద్దంటూ ఈ ఏడాది జూలై 6న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఆ తరువాత ఈ వ్యాజ్యంతో తుది విచారణ జరిపిన ధర్మాసనం 4 రోజుల క్రితం తీర్పు వెలువరించింది.  

ఎప్పుడూ వినని ఆటలకూ.. 
గత 25 సంవత్సరాలుగా ఏటా క్రీడల జాబితాలో మార్పులు చేస్తూ వివిధ రకాల క్రీడలను ప్రభుత్వం జాబితాలో చేరుస్తుండటాన్ని ధర్మాసనం తప్పుబట్టింది. జాబితాలో 48 క్రీడలకు సర్కారు స్థానం కల్పించిందని, వీటిల్లో కొన్నింటి పేర్లు ఎన్నడూ వినలేదని, ఇలాంటి క్రీడలను జాబితాలో చేర్చడంలో తర్కం ఏమిటో అర్థం కావడం లేదంది. జాబితాలో ఏకపక్షం గా మార్పులు చేయడం తదనుగుణంగా ఆయా క్రీడా సంస్థలు ఇష్టమొచ్చినట్లు సర్టిఫికెట్లు జారీ చేస్తున్న విధానం ఆందోళన కలిగిస్తోందని కోర్టు పేర్కొంది.  

జీవో 8ని పునరుద్ధరించలేం 
ప్రస్తుతం జారీ చేసిన జీవో 7ను రద్దు చేసి 2015లో జారీ చేసిన జీవో 8ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. జీవో 7ను రద్దు చేయడానికి ఇబ్బంది లేదు. అయితే జీవో 8ని పునరుద్ధరించడం సాధ్యం కాదు. ఒకవేళ పునరుద్ధరిస్తే తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులు అవినీతిని పట్టించుకోనట్లవుతుంది. క్రీడల కోటా అక్రమాలపై స్పోర్ట్స్‌ అథారిటీ అధికారులపై ఏసీబీ అధికారులు కేసులు కూడా నమోదు చేశారు. కాబట్టి పాత జీవోను పునరుద్ధరించడం లేదు. అలాగే ఈ ఏడాది జారీ చేసిన జీవో 7ను రద్దు చేస్తున్నాం. తిరిగి ఈ మొత్తం వ్యవహారంపై అధ్యయనం అనంతరం నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం’అని ధర్మాసనం తీర్పులో తేల్చి చెప్పింది.

షార్ట్‌కట్‌ అవలంబిస్తున్నారు
వైద్య విద్యలో క్రీడల కోటా కింద ప్రవేశాలు కల్పించడం క్రీడలకు ఏ రకంగా ప్రోత్సాహం కల్పించినట్లు అవుతుందో ఏ మాత్రం అర్థం కావడం లేదని హైకోర్టు పేర్కొంది. ‘అంతగా ప్రతిభ లేని అభ్యర్థులు వైద్య విద్యలో ప్రవేశాల కోసం దేశంలో ఏ మూలన కూడా ఇంతవరకు వినని క్రీడలను ఎం చుకుంటున్నారు. విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం ఇలాంటి షార్ట్‌కట్‌ పద్ధతులు అవలంభిస్తున్న అభ్యర్థులు.. చదువు పూర్తయ్యాక కూడా ఇలాంటి పద్ధతులు అనుసరించకుండా ఉండలేరు. క్రీడల కోటాలో ప్రవేశాల నిమిత్తం ప్రభుత్వం రెండు కమిటీలను ఏర్పాటు చేయడంలో ఎంత మాత్రం తప్పులేదు. మొదటి కమిటీలో క్రీడలకు సంబంధించి వ్యక్తులు ఉంటే, రెండో కమిటీలో వర్సిటీ అధికారులు ఉన్నారు. కాబట్టి ఈ కమిటీల ఏర్పాటును తప్పుబట్టలేం’అని ధర్మాసనం స్పష్టం చేసింది.

మరిన్ని వార్తలు