విద్యాప్రమాణాలపై హైకోర్టు విస్మయం

26 Jan, 2019 03:05 IST|Sakshi

ఏదైనా మండలంపై 3వారాల్లో నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యా ప్రమాణాలపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. చాలా పాఠశాలల్లో మన ప్రధానమంత్రి ఎవరో కూడా చెప్పలేని స్థితిలో విద్యార్థులున్నారని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పాఠశాలలకు తమ పిల్లలను పంపేలా తల్లిదండ్రుల్లో విశ్వాసం నింపేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కేరళలో ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్‌ల పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు వెళతారని, అయితే ఇక్కడ అటువంటి పరిస్థితి కనిపించడం లేదని తెలిపింది.

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాల మెరుగుపై సమగ్ర అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ఏదైనా ఓ మండలాన్ని ప్రాతిపదికగా తీసుకుని అక్కడ ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రమాణాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మూడువారాలకు వాయిదా వేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ ఎంవీ ఫౌండేషన్‌ కన్వీనర్‌ వెంకట్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

మరిన్ని వార్తలు