నిర్భయ చట్టం తెచ్చినా.. మృగాళ్లు మారలేదు 

15 Apr, 2018 01:27 IST|Sakshi

చిన్నారులు, మహిళలపై  నేరాలు పెరగడంపై హైకోర్టు తీవ్ర ఆందోళన 

శిశువులపై లైంగికదాడులకూ వెనుకాడటం లేదు 

మనిషి నైతిక విలువలు పాతాళానికి...

సమర్థ దర్యాప్తు, ప్రాసిక్యూటింగ్‌ ఏజెన్సీలను ఏర్పాటు చేయాలి.. అప్పుడే కఠిన శిక్షలు 

ఐదేళ్ల చిన్నారిని ‘హత్యాచారం’ చేసిన వ్యక్తికి జీవిత ఖైదు సబబే.. కింది కోర్టు తీర్పును  సమర్థించిన హైకోర్టు 

మరణశిక్ష విధించి ఉండాల్సిందని వ్యాఖ్య 

నేరం జరిగి, కింది కోర్టు శిక్ష విధించి  చాలా కాలమైంది.. 

తీర్పులో జోక్యం చేసుకోలేమని స్పష్టం..   అప్పీల్‌ పిటిషన్‌ కొట్టివేత

సాక్షి, హైదరాబాద్‌: చిన్నారులు, మహిళలపై నేరాలు పెరిగిపోతుండటం పట్ల హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. శిశువులపై కూడా లైంగిక దాడులకు వెనకాడటం లేదని, మనిషి నైతిక విలువలు పాతాళానికి పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేసింది. నిర్భయ చట్టం తర్వాతైనా మానవ రూపంలో ఉన్న మృగాల తీరులో మార్పు వస్తుందని అందరూ ఆశించారని, అయితే పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించింది. నిర్భయ చట్టం తెచ్చిన తర్వాత మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు మరింత పెరిగాయని తెలిపింది. ఇలా మళ్లీ మళ్లీ దాడులు జరగకుండా ఉండాలంటే కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. సమర్థవంతమైన దర్యాప్తు, ప్రాసిక్యూటింగ్‌ ఏజెన్సీలను ఏర్పాటు చేసి మానవ మృగాలకు కఠిన శిక్షలు పడేలా చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. లేనిపక్షంలో ఈ దేశంలో మహిళలకు, పిల్లలకు రక్షణ ఉండదని పేర్కొంది. సమాజంలో బలహీనులపై నేరాలు జరగకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలను తీసుకునే దిశగా ఆయా ప్రభుత్వ యంత్రాంగాలు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించింది. 

ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిపి, హత్య చేసిన వ్యక్తికి జీవితఖైదు విధిస్తూ కింది కోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. కింది కోర్టు తీర్పును సమర్థించింది. అన్నెం పున్నెం ఎరుగని చిన్నారిని దారుణంగా చిదిమేసిన ఈ మానవ మృగానికి కింది కోర్టు మరణశిక్ష విధించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. కింది కోర్టు ఇచ్చిన శిక్షను పెంచే విషయంలో నోటీసులు ఇవ్వాలనే దిశగా ఆలోచన చేసినా, ఘటన జరిగి, కింది కోర్టు శిక్ష విధించి సుదీర్ఘ కాలం అయిన నేపథ్యంలో ఆ పని చేయకుండా తమ ను తాము నియంత్రించుకుంటున్నామని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ సీవీ నాగార్జునరెడ్డి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. దేవుడి ప్రతిరూపంగా భావించే చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక వాంఛను పెంచుకున్నాడన్న ఆలోచనే తమకు భరింప సాధ్యం కాకుండా ఉందని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. జమ్మూకశ్మీర్‌లోని కథువాలో ఇటీవల ఎనిమిదేళ్ల చిన్నారిపై అత్యాచారం జరిపి హత్య చేసిన ఘటనపై దేశం మొత్తం తీవ్రంగా స్పందిస్తున్న సమయంలోనే ఈ తీరు వెలువడటం గమనార్హం. 

కేసు పూర్వాపరాలివీ.. 
మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం మనోహరాబాద్‌లో నివసించే గడ్డమీది భిక్షపతి ఓ హత్య కేసులో జైలుకెళ్లాడు. అతడిని విడిపించేందుకు తండ్రి తమ రెండెకరాల పొలాన్ని గొల్ల పెంటయ్య, నాగుల నాగభూషణంలకు అమ్మేశారు. తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన భిక్షపతి.. భూముల విలువలు బాగా పెరిగిన నేపథ్యంలో తాము అమ్మిన భూమికి మరికొంత మొత్తాన్ని ఇవ్వాలని గొల్ల పెంటయ్యను డిమాండ్‌ చేశాడు. అయితే ఇందుకు పెంటయ్య నిరాకరించడంతో అతనిపై భిక్షపతి కక్ష పెంచుకున్నాడు. ఇందుకు పథక రచన చేసిన భిక్షపతి.. అదే గ్రామానికి చెందిన ఓ చిన్నారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఆశజూపి పెంటయ్య పొలం సమీపానికి తీసుకెళ్లాడు. అక్కడ ఆ చిన్నారిపై అత్యాచారం జరిపి హత్య చేశాడు. మృతదేహాన్ని పెంటయ్య పొలంలో పడేశాడు.

చిన్నారిని తీసుకెళ్లడం చూసిన కొందరు గ్రామస్తులు భిక్షపతిని నిలదీశారు. మొదట తనకేమీ తెలియదని చెప్పిన భిక్షపతి, తర్వాత పోలీసుల విచారణలో నిజం ఒప్పుకున్నాడు. పెంటయ్య పొలంలో ఆ చిన్నారి మృతదేహాన్ని పడేసింది తానేనని, చిన్నారి హత్య కేసు పెంటయ్యపై నెట్టేందుకే అలా చేశానని చెప్పాడు. చిన్నారిపై అత్యాచారం జరిపి ఆ తర్వాత హత్య చేసినట్లు పోస్టుమార్టంలో తేలింది. 2011 జూలై 11న జరిగిన ఈ ఘటనపై తూప్రాన్‌ పోలీసులు చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసుపై సిద్దిపేట ఆరో అదనపు జిల్లా సెషన్స్‌ కోర్టు విచారణ జరిపింది. సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు.. హత్య, అత్యాచారం, అపహరణ నేరాలకు భిక్షపతికి జీవితఖైదు విధిస్తూ 2012లో తీర్పు వెలువరించింది. 

దురుద్దేశంతోనే హత్య 
కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ బిక్షపతి అదే ఏడాది హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేశాడు. ఈ అప్పీల్‌పై జస్టిస్‌ నాగార్జునరెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పూర్తి ఆధారాలను పరిశీలించిన ధర్మాసనం.. లైంగిక వాంఛతోనే ఆ చిన్నారిని భిక్షపతి చంపాడని, ఇందుకు సంబంధించి పోలీసులు అన్ని ఆధారాలను సేకరించారని తెలిపింది. ఆ చిన్నారి హత్య విషయంలో భిక్షపతికి దురుద్దేశాలున్నాయని స్పష్టం చేసింది. భిక్షపతి చేసిన అనాగరిక దారుణానికి కింది కోర్టు మరణ దండన విధించి ఉండాల్సిందని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఏ రకంగా చూసినా కింది కోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడం లేదంటూ భిక్షపతి దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది.   

మరిన్ని వార్తలు