ప్రభాస్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట

21 Dec, 2018 12:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : సినీహీరో ప్రభాస్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆయన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ప్రభాస్‌ గెస్ట్‌హౌజ్‌ సీజ్‌ చేసిన వ్యవహారంలో స్టేటస్ కో ఉత్తర్వులను జారీచేసింది. అక్కడ యధాతథంగా పరిస్థితి కొనసాగించాలని తెలిపింది. శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గం సర్వే నెంబర్‌ 46లో గల ప్రభాస్‌ గెస్ట్‌హౌజ్‌ను నాలుగు రోజుల క్రితం రెవెన్యూ అధికారులు సీజ్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా గతంలో ఈ భూమిని జీవో నంబర్‌ 59 కింద రెగ్యులరైజ్‌ చేయాలని కోరుతూ ప్రభాస్‌ దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలిసింది. (హైకోర్టును ఆశ్రయించిన ప్రభాస్‌)

సర్వే నంబర్‌ 46లోని స్థలం ప్రభుత్వ స్థలం గా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ సర్వే నంబర్‌లో 84.30 ఎకరాల స్థలం ఉన్నట్లు తెలిసింది. ఇందులో 2,200 గజాల్లో ప్రభాస్‌ గెస్ట్‌హౌజ్‌ను నిర్మించారు. దీంతో ప్రభుత్వ స్థలంలోని నిర్మాణాలను సీజ్‌ చేసి రెవెన్యూ అధికారులు నోటీసులు అంటించారు. దీనిని సవాల్‌ చేస్తూ హైకోర్టులో ప్రభాస్‌ పిటిషన్‌ వేశారు. స్పందించిన హైకోర్టు గెస్ట్‌హౌజ్‌ సీజ్‌ వ్యవహారంలో యధాతథ స్థితిని కొనసాగించాలని ఉత్తర్వులిచ్చింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 31కి విచారణ వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు