ఎర్రమంజిల్‌ భవనాన్ని కూల్చొద్దు

9 Jul, 2019 00:57 IST|Sakshi

ప్రభుత్వానికి హైకోర్టు మౌఖిక ఆదేశం

విచారణ దశలో జోక్యం చేసుకోదని ఆశిస్తున్నాం

కోర్టులపట్ల సర్కారుకు గౌరవం ఉంటుందన్న ధర్మాసనం

స్టేటస్‌ కో ఉత్తర్వులు జారీ చేసేందుకు నిరాకరణ

తదుపరి విచారణ బుధవారానికి వాయిదా

సాక్షి, హైదరాబాద్‌: ఎర్రమంజిల్‌లోని పురాతన భవనాన్ని కూల్చొద్దని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచింది. వివిధ రకాల కేసులు తమ వద్ద విచారణ దశలో ఉండగా ప్రభుత్వం ఆ భవనాన్ని కూల్చుతుందని తాము భావించట్లేదని వ్యాఖ్యానించింది. కోర్టులపట్ల ప్రభుత్వానికి గౌరవభావం ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. తదుపరి విచారణ బుధవారానికి వాయిదా పడింది. 

ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఆశిస్తున్నాం... 
ఎర్రమంజిల్‌లో 150 ఏళ్ల నాటి పురాతన భవనాన్ని కూల్చి అక్కడ శాసనసభల ప్రాంగణాన్ని నిర్మించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు సోమవారం విచారించింది. భవనాన్ని కూల్చరాదని హైకోర్టు చెప్పిన విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తామని అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు తెలిపారు. ఈ సమయంలో మరో పిటిషనర్, సామాజిక కార్యకర్త లుబ్నా సారస్వత్‌ తరఫు రచనారెడ్డి కల్పించుకొని యథాతథ స్థితి (స్టేటస్‌ కో) ఉత్తర్వులు జారీ చేయాలని లేకుంటే భవనాన్ని ప్రభుత్వం కూల్చేసే అవకాశం ఉందన్నారు. దీనిపై బెంచ్‌ స్పందిస్తూ ‘ప్రభుత్వానికి న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంటుంది. విచారణ దశలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని ఆశిస్తున్నాం. ఎర్రమంజిల్‌ భవనం విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోదని భావిస్తున్నాం’అని మౌఖికంగా పేర్కొంది. 

హైదరాబాద్‌లో ప్రభుత్వ భవనాలపై గవర్నర్‌కే నిర్ణయాధికారం... 
అంతకుముందు వాదనల సందర్భంగా తెలంగాణ జన సమితి ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్‌ పి.ఎల్‌. విశ్వేశ్వర్‌రావు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్‌ స్పందిస్తూ ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం–2014 ప్రకారం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లోని ప్రభుత్వ కట్టడాలపై గవర్నర్‌కే నిర్ణయాధికారం ఉంటుందన్నారు. ఆ చట్టంలోని సెక్షన్‌ 8 (2) (3) ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో భవనాలు, శాంతిభద్రతల అంశాలపై గవర్నర్‌కే అధికారం ఉంటుందని, ప్రభుత్వం నిర్ణయం తీసుకొని అమలు చేయడం చట్ట వ్యతిరేకమని చెప్పారు. గతంలో ఈ భవనాన్ని వారసత్వ సంపదగా గుర్తించారని చెప్పగా అందుకు సంబంధించిన పత్రాలు సమర్పించాలని ధర్మాసనం కోరింది.

ప్రభుత్వం గుర్తించకుండానే వందేళ్లు దాటిన కట్టడాలను జాతీయ వారసత్వ సంపదగా పరిగణించరని కూడా చెప్పింది. అయితే ఆ వివరాల్ని తర్వాత అందజేస్తామని, కొత్త అసెంబ్లీ భవనాల నిర్మాణం కోసం గత నెల 28న ప్రభుత్వం శంకుస్థాపన చేసిందని న్యాయవాది బదులిచ్చారు. పత్రికల్లో వచ్చిన వార్తలను ఆధారంగా చూపవద్దని, ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు లేదా జీవోలను ఆధారాలుగా చూపాలని ధర్మాసనం కోరింది. ఎర్రమంజిల్‌ భవనాన్ని కూల్చాలని నిర్ణయం తీసుకున్నట్లు కౌంటర్‌లో ప్రభుత్వం చెప్పిందని న్యాయవాది బదులిచ్చారు. దీనిపై ధర్మాసనం కల్పించుకొని ఎర్రమంజిల్‌లో అసెంబ్లీ సముదాయాన్ని నిర్మించాలని మాత్రమే ఉందని, ఉన్న భవనాన్ని కూల్చుతామని ఎక్కడా కౌంటర్‌లో లేదని గుర్తుచేసింది. ఎర్రమంజిల్‌ వద్ద అసెంబ్లీ నిర్మిస్తే అక్కడి ఇరుకురోడ్ల కారణంగా ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతాయని గతంలో చెప్పారని, దీనికి సంబంధించిన గూగుల్‌ మ్యాప్‌లతో వివరించాలని ధర్మాసనం కోరింది. ఉన్న భవనాన్ని వదిలి కొత్త భవనాన్ని నిర్మించాలనే నిర్ణయం వల్ల ప్రజాధనం దుర్వినియోగం చేయడమే అవుతుందన్నారు. 

హైకోర్టును ఆశ్రయించిన నవాబు వారసులు... 
ఎర్రమంజిల్‌ భవనాల్ని 1870లో నవాబ్‌ సఫ్దర్‌జంగ్‌ ముషీర్దౌలా ఫక్రుల్‌ ముల్క్‌ నిర్మించారని, ఆ భవనం, అక్కడి స్థలం అంశాలపై సివిల్‌ వివా దం ఉండగా ప్రభుత్వం ఆ భవనాన్ని కూల్చి అసెంబ్లీ భవనాన్ని నిర్మించడం చెల్లదంటూ నవాబు వార సులు నూరి మజుఫర్‌ హుస్సేన్, మరో ఏడుగురు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ల తరఫు న్యాయవా ది రచనారెడ్డి కోరారు. ఎర్రమంజిల్‌లో వివిధ రూపాల్లో వినియోగించగా ఎకరం 21 కుంటల స్థలం విషయంలో ప్రభుత్వంతో 1951 నుంచి సివి ల్‌ వివాదం నడుస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ఆ వివాదం పరిష్కారం కాకుండానే అసెంబ్లీ భవనాల నిర్మాణ ప్రయత్నాలను అడ్డుకోవాలని కోరారు.  
 

మరిన్ని వార్తలు