గ్రేటర్‌లో అక్రమ నిర్మాణాలపై హైకోర్టులో విచారణ

13 Dec, 2016 03:24 IST|Sakshi

- నివాస ప్రాంతాలను వాణిజ్య ప్రాంతాలుగా చేస్తున్నారు
- అయినా గ్రేటర్‌ అధికారులు పట్టించుకోవడం లేదు
- హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం.. నేడు విచారణ


సాక్షి, హైదరాబాద్‌:
గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో నివాస భవన సముదాయాలను నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య సముదాయాలుగా మారుస్తున్నారని, నివాస ప్రాంతాలను వాణిజ్య ప్రాంతాలుగా మార్చేస్తున్నారని, దీనిపై అధికారులు  స్పందించడం లేదని హైకోర్టులో  పిల్‌ దాఖలైంది. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తున్నా, రోడ్లను కూరగాయల మార్కెట్లుగా మార్చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ సికింద్రాబాద్, శాంతినగర్‌కు చెందిన పి.సంతోష్‌కుమార్‌ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇందులో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్‌ఎంసీ కమిషనర్, చీఫ్‌ సిటీ ప్లానింగ్‌ ఆఫీసర్‌ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఈ వ్యాజ్యాన్ని విచారణ జరపనుంది.

నగరంలోని బాగ్‌లింగంపల్లి కాలనీలో హౌసింగ్‌ బోర్డ్‌ నిర్మించిన గృహ సముదాయాలను పలువురు ఇటీవల కాలంలో  అనుమతుల్లేకుండా వాణిజ్య సముదాయాలుగా మార్చేస్తున్నారని పిటిషనర్‌ తెలిపారు. అక్రమ నిర్మాణాలు కూడా చేపడుతున్నారని వివరించారు. దీనిపై అధికారులకు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదన్నారు. నల్లకుంటలోని ఇన్నర్‌ రోడ్డును కూరగాయల మార్కెట్‌గా మార్చేశారని, కుళ్లిన కూరగాయలను రోడ్లపై పడేస్తున్నారని, దీంతో ఆ ప్రాంతం అపరిశుభ్రంగా తయారవుతోందని తెలిపారు. అలాగే శివం రోడ్డులోనూ నిబంధనలకు విరుద్ధంగా పలు అక్రమ నిర్మాణాలు వెలిశాయన్నారు. వీటి వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, తగిన గాలి, వెలుతురు లేక అరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారని తెలి పారు. 80 చదరపు గజాల స్థలంలో 4 అంతస్తులతో పాటు పెంట్‌ హౌస్‌లను నిర్మిస్తున్నారని, గ్రేటర్‌ పరిధిలోని ప్రతీ కాలనీలోనూ పరిస్థితి ఇలానే ఉందన్నారు.

>
మరిన్ని వార్తలు