అధిక చార్జీలు వసూలు చేయనీయకండి

11 Oct, 2019 03:23 IST|Sakshi

బస్‌పాస్‌దారుల నుంచి టికెట్‌ డబ్బులు తీసుకోవద్దు

ఆర్టీసీ సమ్మె కేసులో ప్రభుత్వానికి హైకోర్టు మౌఖిక ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె విరమింపజేయాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంలో హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగినా మధ్యంతర ఉత్తర్వులు ఏమీ జారీ కాలేదు. సమ్మె నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా నడుపుతున్న బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేస్తున్నారని వాట్సాప్‌ మెసేజ్‌లు వస్తున్నాయని ధర్మాస నం తెలిపింది. అధిక చార్జీలు, బస్‌ పాసులున్న వారి నుంచి కూడా టికెట్‌ డబ్బులు వసూలు చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మౌఖిక ఆదేశాలిచ్చింది. సమ్మె విరమించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్‌ న్యాయవాది పలుమార్లు కోరితే.. ప్రజలేమీ ఇబ్బందులు పడటం లేదని, సమ్మె నేపథ్యంలో పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని ప్రభు త్వం చెప్పింది.

సమ్మె చట్ట విరుద్ధమని, క్రమశిక్షణా చర్యలు తప్పవంటూ ప్రభుత్వం చేసిన వాదనను ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్, ఆర్టీసీ ఉద్యోగుల, కార్మిక సంఘం జేఏసీల తరఫు న్యాయవాదులు వ్యతిరే కించారు. మధ్యంతర ఆదేశాల ప్రతిపాదనపై ఏమంటా రని ధర్మాసనం ప్రశ్నిస్తే.. వాయిదా వేయాలని యూనియన్ల తరఫు న్యాయవాదులు, మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని ప్రభుత్వం చెప్పింది. దీంతో ప్రభుత్వం, ఆర్టీసీ, సంఘం, జేఏసీ ఇతర ప్రతివాదులు కౌంటర్‌ పిటి షన్లు దాఖలు చేయాలని ఆదేశించి విచారణను ఈ నెల 15కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డి, జస్టిస్‌ ఎ.అభిషేక్‌రెడ్డిల ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. సమ్మె తర్వాత చేసిన ఏర్పాట్లపై ప్రభుత్వం సమర్పించిన నివేదిక అసమగ్రంగా ఉందని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది.

ప్రయాణికులు వస్తే బస్సులు రెడీ: అదనపు ఏజీ 
ఉస్మానియా విశ్వవిద్యాలయం రీసెర్చ్‌ స్కాలర్‌ ఆర్‌.సుబేందర్‌సింగ్‌ దాఖలు చేసిన పిల్‌పై గురువారం మరోసారి వాదనలు జరిగాయి. తొలుత అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదిస్తూ.. ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమని, ప్రయాణికుల సమస్యల కోణంలో ఏమాత్రం ఆలోచన చేయకుండా సమ్మెకు దిగారని చెప్పా రు. సమ్మె ప్రభావం ప్రయాణికులపై పడకుండా ఉం డేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామన్నారు. డిపోల్లో బస్సులు, డ్రైవర్లు, కండక్టర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పగా.. ధర్మాసనం కల్పించుకుంటూ ‘అయితే ప్రయాణికులే లేరంటారా..’ అని వ్యాఖ్య చేయడంతో అందరూ నవ్వారు. ప్రయాణికులు ఎంతమంది వచ్చినా వారికి సరిపడేలా బస్సులు నడుపుతామని అదనపు ఏజీ చెప్పారు. ధర్మాసనం కల్పించుకుని.. తాము హైకోర్టుకు వస్తుంటే బస్సులు కనబడలేదన్నారు. దీనిపై అదనపు ఏజీ జవాబిస్తూ.. దసరా పండుగ ప్రభావం వల్ల ప్రయాణికులు లేరని చెబితే.. పండుగ సందడి నిన్ననే అయిపోయిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

సమ్మె చట్ట విరుద్ధం.. 
సమ్మె చట్ట విరుద్ధమని, కార్మిక వివాదాలపై హైకోర్టును ఆశ్రయించకూడదని, కార్మికశాఖలోని సంబంధిత అధీకృత అధికారి వద్ద చెప్పుకోవాలని అదనపు ఏజీ అన్నారు.  అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌ వాదిస్తూ.. పిల్‌ వెనుక ప్రజాహితమేమీ లేదని, కార్మిక సంఘ నేతల హితం కోరే పిల్‌ దాఖలు చేశారని చెప్పారు. బస్సుల్ని నడుపుతుంటే అడ్డుకోవడం ద్వారా ఆర్టీసీ కార్మికులకు ప్రయాణికుల సౌకర్యాల కల్పనపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోందన్నారు. సమ్మె చట్టను విరమింపునకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి.వి.కృష్ణయ్య కోరారు.  ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్‌ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి తరఫున సీనియర్‌ న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి వాదిస్తూ.. సమ్మె చట్ట విరుద్ధమని ప్రభుత్వ చేస్తున్న వాదనను తోసిపుచ్చారు.

నిధుల్ని వాడుకున్నారు..
జేఏసీ తరఫు న్యాయ వాది రచనారెడ్డి వాదిస్తూ.. పనిచేసిన కాలానికి జీతాలు చెల్లించకపోవడమేమిటో అర్థం కావడం లేదన్నారు. పీఎఫ్, కోఆపరేటివ్‌ సొసైటీ ఫండ్స్‌ రూ.545 కోట్లను ప్రభుత్వం తీసేసుకుందని, ఎంతోమందికి ఆర్టీసీలో ప్రభుత్వం రాయితీలిస్తూ ఆ మొత్తాల్ని చెల్లించకుండా ఆర్టీసీ ఆర్థికంగా దెబ్బతినేలా చేసిందన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా