ఈ దశలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

19 Sep, 2018 02:05 IST|Sakshi

ఓటర్ల జాబితా సవరణ గడువు కుదింపుపై ధర్మాసనం స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ రద్దు నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నందున ఓటర్ల జాబితా సవరణ గడువును కుదిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఈ నెల 8న జారీ చేసిన నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పుపట్టలేమని స్పష్టం చేసింది. ఈ దశలో ఎన్నికల సంఘం నిర్ణయంపై జోక్యం చేసుకోవడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. రాజ్యాంగ నిబంధనలకు లోబడి గరిష్టంగా 6 నెలల్లోపు ముందస్తు ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని పేర్కొంది.

రాజ్యాంగ నిబంధనలను, సుప్రీం కోర్టు తీర్పులను పరిగణనలోకి తీసుకున్నాకే ఓటర్ల జాబితా సవరణ గడువును ఎన్నికల సంఘం కుదించిందని తెలిపింది. తెలంగాణ విషయంలోనే ఈ నిర్ణయం తీసుకోలేదని, ఎన్నికలు జరగాల్సి ఉన్న రాజస్తాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంలలో కూడా ఇలాగే నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ తొట్టతిల్‌ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.  

కుదించకపోతే సమస్యలొస్తాయి..
ఓటర్ల జాబితా సవరణకు మొదట 2019 జనవరి 1వ తేదీని గడువుగా నిర్ణయించారని, ఆ తర్వాత దాన్ని ముందస్తు ఎన్నికలను కారణంగా చూపుతూ ఈ ఏడాది జనవరి 1 నాటికి కుదిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నోటిఫికేషన్‌ జారీ చేశారని, ఇది రాజ్యాంగ విరుద్ధమంటూ న్యాయవాది కొమిరెడ్డి కృష్ణ విజయ్‌ ఆజాద్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ప్రధాన ఎన్నికల అధికారి నోటిఫికేషన్‌ వల్ల దాదాపు 25 లక్షల మంది ఓటర్ల జాబితాలో చేరే అవకాశం కోల్పోతున్నారని తెలిపారు.

ఇప్పటికే సవరించిన ఓటర్ల జాబితాలో 60 లక్షల మంది ఓటర్ల పేర్లు గల్లంతయ్యాయని వివరించారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ముందస్తు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ గడువును కుదించకపోతే తుది జాబితా రూపకల్పనలో ఎన్నికల సంఘానికి అనేక సమస్యలొస్తాయని పేర్కొంది. ఇదే జరిగితే దాని ప్రభావం ఎన్నికలపై పడుతుందని, తద్వారా అనేక రాజ్యాంగపరమైన సమస్యలు ఎదురవుతాయని తెలిపింది. కాబట్టి వాస్తవిక కోణంతో ఆలోచిస్తే అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నాకే ఓటర్ల జాబితా సవరణ గడువును కుదించినట్లు స్పష్టమవుతోందని వివరించింది.

‘ఈ నోటిఫికేషన్‌లో ఎటువంటి వైరుధ్యాలు కనిపించట్లేదు. ఈ నోటిఫికేషన్‌ వల్ల ఎన్నికలు ప్రశాంత, నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదని చెప్పేందుకు పిటిషనర్‌ ఎలాంటి ఆధారాలు చూపట్లేదు. రాజ్యాంగం ప్రకా రం నిర్వర్తించాల్సిన బాధ్యతల మేరకే ఈ నోటిఫికేషన్‌ జారీ అయింది. ప్రస్తుత దశలో ఈ నోటిఫికేషన్‌ విషయంలో ఏ రకంగా జోక్యం చేసుకోలేం’అని ధర్మాసనం ఉత్తర్వుల్లో పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టేసింది. పిటిషన్‌ను కొట్టేసేందుకు ధర్మాసనం సిద్ధమవుతున్న సమయంలో తమ పిటిషన్‌ ఉపసంహరణకు పిటిషనర్‌ తరఫు న్యాయవాది చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది.

మరిన్ని వార్తలు