కరోనా వైద్యానికి ఎందుకు వినియోగించొద్దు..?

11 Jul, 2020 03:23 IST|Sakshi

ప్రభుత్వంతో పాటు మిలటరీ, రైల్వే, ప్రైవేట్‌ బోధనాస్పత్రులకు నోటీసులు

వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: కరోనా వైరస్‌ తీవ్రత దృష్ట్యా ప్రభుత్వ, మిలటరీ, ప్రైవేట్‌ బోధనాస్పత్రులను వైద్యం అందించేందుకు వినియోగించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు స్పందించింది. ప్రభుత్వంతో పాటు మిలటరీ, రైల్వే, ప్రైవేట్‌ బోధనాస్పత్రుల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసింది. బోధనాస్పత్రుల్ని కరోనా వైద్య సేవలకు ఎందుకు వినియోగించుకోరాదో తెలియజేస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను 13వ తేదీకి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం శుక్రవారం నిర్ణయం తీసుకుంది.

పిల్‌ దాఖలు చేసిన డాక్టర్‌ శ్రీవాత్సవ తరఫు న్యాయవాది వసుధా నాగరాజ్‌ వాదిస్తూ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల భవనాలు, మిలట్రీ ఆస్పత్రి, పైవేట్‌ బోధనాస్పత్రుల్ని కరోనా వైద్య సేవల కోసం వినియోగించుకునేలా ఉత్తర్వులు ఇవ్వాలన్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బోధనాస్పత్రులను వైద్య సేవలకు వినియోగంపై ప్రభుత్వ విధానం చెప్పాలని ధర్మాసనం వివరణ కోరింది. రైల్వే ఆస్పత్రి, మిలటరీ ఆస్పత్రి, ప్రైవేట్‌ బోధనాస్పత్రులు అపోలో, డెక్కన్, కామినేని, భాస్కర, సాధన్, ఆయాన్‌ తోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. 

మరిన్ని వార్తలు