కలెక్టర్‌ ఏం చేస్తున్నారు?

11 Jul, 2018 02:30 IST|Sakshi

దేవతలగుట్ట సర్కారు భూముల కబ్జాపై హైకోర్టు ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లోని దేవతలగుట్టపై ఉన్న ఆలయాలను కూల్చి 150 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే జిల్లా కలెక్టర్‌ ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ఆ స్థలంలో ఇళ్లు నిర్మిస్తున్నట్లు తెలిసినా కళ్లు మూసుకుని ఉండటమో.. నిద్రపోవడమో చేస్తుంటారని మండిపడింది.

జరు గుతున్న వ్యవహారం చూస్తుంటే రాజకీయ నేతల చేతుల్లో అధికారులు డమ్మీలుగా మారిపోయారని ఘాటుగా వ్యాఖ్యానించింది. సర్కారు భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని, ఆ భూములను మూడు నెలల్లో స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ బి.రాధా కృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ల ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.  

ఫిర్యాదు చేసినా ఫలితం లేదు..
దేవతలగుట్టపై ఉన్న వీరభద్రస్వామి, ఇతర దేవాలయాలను కూల్చేయడమే కాకుండా 150 ఎకరాల ప్రభుత్వ భూమిలో ప్రైడ్‌ ఇండి యా బిల్డర్స్‌ పెద్ద ఎత్తున నిర్మాణాలు చేపడుతోందని, దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని దేవతలగుట్ట పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు నాం రామ్‌రెడ్డి హైకోర్టులో పిల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఆయనతో పాటు నిర్మాణదారులు కూడా రెండు వ్యాజ్యాలు దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పీఎస్పీ సురేశ్‌కుమార్‌.. దేవతలగుట్టపై ఆక్రమణల గురించి ధర్మాసనా నికి వివరించారు. కేసులో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలను హెచ్‌ఎండీఏ తరఫు న్యాయవాది వై.రామారావు కోర్టుకు తెలిపారు.  

హెచ్‌ఎండీఏకు ఏం సంబంధం: కోర్టు
పిటిషనర్‌ వాదనలు విన్న ధర్మాసనం తీవ్రం గా స్పందించింది. కబ్జాదారులపై అధికారులు కఠినంగా వ్యవహరిస్తుంటే భూముల ఆక్రమణలు ఎందుకు జరుగుతాయని నిలదీసింది. కలెక్టర్‌ మొదట్లోనే చట్ట ప్రకారం వ్యవహరించి ఉంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదని వ్యాఖ్యానించింది. ఇలాంటి వ్యవహారాల్లో నిర్ణయాధికారం ఎవరిదని ధర్మాసనం ప్రశ్నించ గా.. ఆ అధికారం కలెక్టర్‌దేనని, అయితే ఆ ప్రాంతం హెచ్‌ఎండీఏ పరిధిలోకి వస్తుందని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు.

కోర్టు స్పందిస్తూ.. ‘హెచ్‌ఎండీఏకి ఏం సంబంధం. అది ఓ అభివృద్ధి సంస్థ మాత్రమే. చట్ట ప్రకారం వ్యవహరించాల్సింది కలెక్టరే. దీనికి హెచ్‌ఎండీఏను బాధ్యులను చేయడం తగదు’ అని వ్యాఖ్యానించింది.  తమ నిర్మాణాలున్న భూమి ప్రభు త్వ భూమి కాదని, నాలుగేళ్ల క్రితమే తమ నిర్మాణాల క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకున్నామన్ని నిర్మాణదారుల తరఫు న్యాయవాదులు తెలిపారు.

వాదనలు విన్న కోర్టు.. ప్రభు త్వ భూముల్లో నిర్మాణాలు చేపట్టొద్దని గతం  లో ఇచ్చిన ఆదేశాలు అమల్లో ఉంటాయని పేర్కొంది. పూర్తయిన నిర్మాణాల క్రమబద్ధీకరణపై చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోవాలని  హెచ్‌ఎండీఏ కమిషనర్‌ను ఆదేశించింది. కోర్టు ఆదేశాల అమలుకు ఏం చర్యలు తీసుకున్నారో హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌కు నివేదికివ్వాలని కలెక్టర్, హెచ్‌ఎండీఏ కమిషనర్‌లను.. ఆ నివే దికలను పరిశీలన కోసం సీజే ముందుంచాల ని రిజిస్ట్రార్‌ జనరల్‌ను ఆదేశించింది. దీనికి సంబంధించిన వ్యాజ్యాలను మూసేసింది.

మరిన్ని వార్తలు