ఆర్వీఎం.. అస్తవ్యస్తం

9 Jun, 2014 02:46 IST|Sakshi

ఖమ్మం, న్యూస్‌లైన్ : పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించడం, ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడం, వెనకబడిన విద్యార్థులు, బడి మానేసిన, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు బోధన వంటి అంశాల్లో కీలక భూమిక పోషించే రాజీవ్ విద్యామిషన్ జిల్లాలో అస్తవ్యస్తంగా మారింది. వందల కోట్ల రూపాయల నిధులు వచ్చే ఈ శాఖలో పనిచేస్తున్న పలువురు ఉద్యోగుల మధ్య పంపకాల గొడవను పరిష్కరించే నాథుడే కరువయ్యాడనే విమర్శలు వస్తున్నాయి. ఈ శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల మధ్య గ్రూపు తగాదాలతో అయిన వారికి అందలం.. కాని వారిపై వేటు వేసే ధోరణి కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు కోట్లాది రూపాయల నిధుల వినియోగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే కీలకం కావడం, అన్నింటా వారికే ప్రాధాన్యత ఇవ్వడం పలు సందేహాలకు తావిస్తోంది.
 
జీసీడీవో సరెండర్‌పై అనుమానాలు...
బాలికల విద్యా అభివృద్ధి అధికారిణి సంధ్యశ్రీని తొలగించి, ఆమె స్థానంలో మరొకరిని నియమించడం ఆర్వీఎంలో దుమారం రేపుతోంది.  కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల(కేజీబీవీ) నిర్వహణలో ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేయడం లేదనే నెపంతో జీసీడీవో సంధ్యశ్రీని, సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్‌ను విద్యాశాఖకు సరెండర్ చేశారు. అయితే కొత్తగా జీసీడీవో, ఇతర సెక్టోరియల్ అధికారి నియామకానికి సంబంధిత ఉద్యోగుల సీనియారిటీ, సర్వీసు, ఇతర అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలి. కానీ అదేమీ చేయకుండా ఇటీవల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలిగా పదోన్నతి పొందిన శివకుమారికి జీసీడీవో బాధ్యతలు అప్పగించడం విద్యాశాఖలో చర్చనీయాంశంగా మారింది. ఆర్‌వీఎం పీవో శ్రీనివాస్‌కు, జీసీడీవో సంధ్యశ్రీకి మధ్య సమన్వయం లేదని,  అందుకే కావాలనే పీవో జీసీడీవోను సరెండర్ చేసి కొత్తవారిని నియమించారని ప్రచారం జరుగుతోంది.
 
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అధిక ప్రాధాన్యత...
ఏటా వందల కోట్ల రూపాయల నిధులు వచ్చే ఆర్వీఎంలో కీలకమైన అకౌంట్ సెక్షన్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులే కీలకంగా మారడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆర్‌వీఎం పీవోకు, ఆశాఖ ఫైనాన్స్ అధికారికి మధ్య సమన్వయం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో కావాలనే పీవో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రాధాన్యత ఇచ్చి మిగిలిన వారిపై వేటు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఈ శాఖలో అక్రమాలు జరిగాయని భావించిన గత కలెక్టర్ సిద్ధార్థజైన్ ఆర్‌వీఎం నిధుల వినియోగంపై ప్రత్యేక బృందంతో ఆడిట్ చేయాలని అప్పటి పీవో వెంకటనర్సమ్మను ఆదేశించారు. కానీ ఆ తర్వాత వెంకటనర్సమ్మ, సిద్ధార్థజైన్ ఇద్దరూ జిల్లా నుంచి బదిలీ కావడంతో ఆ శాఖలో ఉన్న అధికారులతోనే ఆడిట్ చేయించారని, దీంతో అంతా అనుకూలంగానే బిల్లులు సృష్టించి ఆడిట్‌ను మమ అనిపించారనే విమర్శలు వస్తున్నాయి.
 
 ఆడిట్ సెక్షన్‌లో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నా.. వారిని కాదని ఔట్ సోర్సింగ్ ద్వారా నియమితులైన  వారి పనులకు బదులుగా బిల్లులు, ఇతర ఆర్థిక లావాదేవీల పనులు అప్పగిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో అవకతవకలు జరిగితే బాధ్యులు ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా జిల్లా అధికారులు ఆర్వీఎంపై ప్రత్యేక దృష్టి సారించి అస్తవ్యస్తంగా ఉన్న ఈ శాఖను చక్కదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు ఉద్యోగులు పేర్కొంటున్నారు.

>
మరిన్ని వార్తలు