13 జిల్లాల్లో అధిక వర్షపాతం

13 Jul, 2017 02:31 IST|Sakshi
13 జిల్లాల్లో అధిక వర్షపాతం

15 జిల్లాల్లో సాధారణంగా నమోదు
నిజామాబాద్, జగిత్యాల, మెదక్‌ జిల్లాల్లో మాత్రం లోటు
రాష్ట్రవ్యాప్తంగా సగటున 10 శాతం అధిక వర్షపాతం
56.67 లక్షల ఎకరాల్లో మొదలైన పంటల సాగు
భారీగా పెరుగుతున్న పత్తి.. ఇంకా ఊపందుకోని వరి నాట్లు


సాక్షి, హైదరాబాద్‌: ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటివరకు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సాధా రణానికి మించి అధిక వర్షపాతం నమోదైనట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. మరో 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదుకాగా.. నిజామాబాద్, జగిత్యాల, మెదక్‌ జిల్లాల్లో మా త్రం లోటు వర్షపాతం నమోదైందని బుధవా రం విడుదల చేసిన నివేదికలో తెలిపింది. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే పది శాతం అధికంగా వర్షపాతం నమోదైంది.

పది శాతం అధికంగా..
రాష్ట్రంలో జూన్‌ ఒకటో తేదీ నుంచి జూలై 12వ తేదీ మధ్య కురవాల్సిన సాధారణ వర్షపాతం 210 మిల్లీమీటర్లుకాగా.. ఈ ఏడాది 231.7 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఇది సాధారణం కంటే 10 శాతం అధికం కావడం గమనార్హం. అయితే ఈ నెల తొలి 12 రోజుల్లో మాత్రం 38.8 శాతం లోటు వర్షపాతం నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. సాధారణంగా జూలై 1 నుంచి 12 వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం 81.7 మిల్లీమీటర్లుకాగా.. ఈసారి 42.9 మిల్లీమీటర్లే కురిసింది. అయితే ప్రస్తుతం భారీ వర్షాలు కురవకపోవడం పంటలకు మేలు చేసేదేనని, వర్షాలు కురిస్తే మొక్కలు కుళ్లిపోతాయని వ్యవ సాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ నాలుగైదు రోజుల తర్వాత గానీ వర్షాలు ప్రారంభం కాకపోతే ఎండిపోయే అవకాశం ఉందని అంటున్నారు.

ఊపందుకున్న సాగు
రాష్ట్రంలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 1.08 కోట్ల ఎకరాలుకాగా.. బుధవారం నాటికి 56.67 లక్షల (52%) ఎకరాల్లో పంటల సాగు ప్రారంభమైనట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. ఇందులో పత్తి పంట ఏకంగా 35.12 లక్షల ఎకరాల్లో సాగుకావడం గమనార్హం. పత్తి సాధారణ సాగుతో పోలిస్తే ఇప్పటికే 84 శాతంగా నమోదైంది. ఇక పప్పుధాన్యాల సాధారణ సాగు 10.55 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 5.8 లక్షల (55%) ఎకరాల్లో సాగు ప్రారంభమైంది. గతేడాది ఇదే సమయానికి సాధారణం కంటే అధికంగా.. ఏకంగా 14.07 లక్షల ఎకరాల్లో సాగు కావడం గమనార్హం. ఇక మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 13.20 లక్షల ఎకరాలుకాగా.. ఇప్పటివరకు 6.8 లక్షల (52%) ఎకరాల్లో సాగైంది. వరి సాధారణ సాగు 23.35 లక్షల ఎకరాలుకాగా.. 2.32 లక్షల (10%) ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. నాట్లు వేయడానికి ఇంకా సమయం ఉన్నందున ఆగస్టులో వరిసాగు పుంజుకునే అవకాశముంది. జిల్లాల వారీగా చూస్తే... ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 90 శాతం సాగు మొదలుకాగా.. వనపర్తి జిల్లాలో అత్యంత తక్కువగా 25 శాతం విస్తీర్ణంలోనే పంటలు వేశారు.

నాలుగు రోజులు సాధారణ వర్షాలు
వచ్చే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడా ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నాలుగు రోజులపాటు ఎక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని పేర్కొంది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా