తీర్పుకు భద్రత ‘స్ట్రాంగ్‌’ 

9 Dec, 2018 10:57 IST|Sakshi
స్ట్రాంగ్‌ రూం వద్ద కాపలాకాస్తున్న పోలీసులు

సాక్షి, వనపర్తి క్రైం: జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ శుక్రవారం ప్రశాంతంగా ముగియడంతో అధికా రులు ఊపిరిపీల్చుకున్నారు. వనపర్తి అసెంబ్లీ ని యోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంలను వనపర్తి మండలం చిట్యాల గోదాంలోని స్ట్రాంగ్‌ రూం లకు తరలించారు.

వనపర్తి పట్టణం, వనపర్తి మండలం, పెబ్బేరు, గోపాల్‌పేట, శ్రీరంగాపురం, రేవల్లి, పెద్దమందడి, ఘనపురం మండలాల ఈవీఎంలను ఇక్కడే భద్రపరిచారు. గోదాం చుట్టూ పోలీస్‌ బలగాలతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు. అంతకుముందు పోలింగ్‌ ముగిసిన తర్వాత ఎన్నికల సిబ్బంది ప్రత్యేక వాహనాల్లో ఆయా కేంద్రాల నుంచి ఈవీఎంలను ఇక్కడి తరలించింది.

   
కేంద్ర బలగాలతో భద్రత 
నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడంతో పోలింగ్‌ ప్రశాంతంగా జరిగింది. ఎస్పీ అపూర్వరావు పర్యవేక్షణ, కలెక్టర్‌ శ్వేతామహంతి ఓటు హక్కు వినియోగంపై అవగాహన పెంచడంతో ఈసారి ఓటింగ్‌ శాతం పెరిగింది. 80.83శాతం ఈ సారి పోలింగ్‌ నమోదైందని అధికారులు వెల్లడించారు.

పోలింగ్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రతిఒక్కరూ స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ అనంతరం ఈవీంలను ప్రత్యేక వాహనాల్లో కేంద్ర బలగాల భద్రత మధ్య స్ట్రాంగ్‌ రూంలకు చేర్చారు. సెంట్రల్‌ ఫోర్స్‌ బలగాలు, ఇన్‌చార్జ్‌ పోలీసులతో ఈవీఎంల భద్రతను కట్టుదిట్టం చేశారు. నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌ల ఈవీఎంలను ఇక్కడే భద్రత పరిచారు.

 
11న ఓట్ల లెక్కింపు 
ఈనెల11న ఓట్ల లెక్కింపు జరగనుంది. నియోజకవర్గంలోని ఆయా పొలింగ్‌ బూత్‌ల ఈవీఎంల లెక్కింపు చేపట్టనున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల భవిష్యత్‌ తేలనుంది. 200 మంది సివిల్‌ పోలీసులు, 100 మంది హోంగార్డులు, 45 మంది కేంద్ర బలగాల భద్రత మధ్య ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. ఎవరు గెలుస్తారోననే ఉఠ్కంత ఇప్పటినుంచే మొదలైంది.  

 
భద్రత మరింత పెంచుతాం  
చిట్యాల గోదాంలో ఈవీఎంలకు పటిష్ట భద్రత కల్పించాం. కేంద్ర పోలీసు బలగాలు గోదాం చుట్టూ పహారా కాస్తున్నాయి. ఈనెల11న జరిగే ఓట్ల లెక్కింపు రోజున మరింత భద్రత పెంచుతాం.                   
  – భాస్కర్, ఏఎస్పీ, వనపర్తి   

మరిన్ని వార్తలు