ఇక వాహనంతో పాటే ‘హైసెక్యూరిటీ’

26 Apr, 2019 00:40 IST|Sakshi

షోరూమ్‌ల్లోనే వాహన రిజిస్ట్రేషన్‌లు

త్వరలో డీలర్లతో సమావేశం

మే నెల నుంచి అమలుకు రవాణాశాఖ సన్నాహాలు 

సాక్షి, హైదరాబాద్‌ : ఇక నుంచి హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ప్లేట్ల (హెచ్‌ఎస్‌ఆర్‌పీ)తో పాటే  వాహనాలు  రోడ్డెక్కనున్నాయి. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌లపై వాహనాలను విడుదల చేసే పద్ధతికి త్వరలో స్వస్తి చెప్పనున్నారు. బండి కొనుగోలు సమయంలో  షోరూమ్‌లోనే  శాశ్వత రిజిస్ట్రేషన్‌తో పాటు  హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్‌ను  బిగించి ఇవ్వనున్నారు. మే నెల నుంచి ఈ విధానాన్ని అమలు చేసేందుకు రవాణాశాఖ సన్నాహాలు చేపట్టింది. ఇటీవల కేంద్రం వాహన తయారీదార్లతో జరిపిన సమావేశంలో  ఈ అంశంపై చర్చించింది. వాహనం తయారీతో  పాటే హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్‌  ఏర్పాటు చేసి ఇవ్వడం సాంకేతికంగా సాధ్యం కాదని  తయారీదార్లు తేల్చారు. అది డీలర్ల స్థాయి లోనే అమలు జరగాలని స్పష్టీకరించారు. ఈ  మేరకు కేంద్రం  తాజాగా  విధివిధానాలను రూపొందించింది. దీంతో రవాణా శాఖ చర్యలు చేపట్టింది. త్వరలో ద్విచక్ర వాహనా లు, కార్లు, తదితర అన్ని రకాల వాహన డీలర్లతో సమావేశం జరిపి మే నెల నుంచి   అమలు చేయనున్నట్లు  సంయుక్త రవాణా కమిషనర్‌ సి.రమేష్‌  ‘సాక్షి’తో  చెప్పారు. 

హెచ్‌ఎస్‌ఆర్‌పీ ఇలా....
వాహనాల భద్రత దృష్ట్యా  హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్‌ నంబర్‌ప్లేట్లను  అమర్చాలని సుప్రీంకోర్టు  గతంలో ఆదేశించింది. ఈ మేరకు  రవాణాశాఖ  2013 నుంచి  హెచ్‌ఎస్‌ఆర్‌పీని అమలు చేస్తోంది. రాష్ట్రంలో లింక్‌ ఆటోటెక్‌ సంస్థకు ఆ బాధ్యతలను అప్పగించారు. మొదట్లో ఆర్టీఏలో నమోదయ్యే వాహనాల డిమాండ్‌కు అనుగుణంగా నంబర్‌ప్లేట్‌లను  తయారు చేసి ఇవ్వడంలో  ఆ సంస్థ  విఫలమైంది. ఒక్కో వాహనానికి  కనీసం 2 నుంచి 3 నెలల వరకు సమయం పట్టేది.దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఏటా సుమారు  2 లక్షల వాహనాలు రోడ్డెక్కుతుండగా వాటిలో  కనీసం సగానికి కూడా అందజేయలేకపోయారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు  మరోసారి జోక్యం చేసుకోవడంతో  ఆర్టీఏ అధికారులు   దీనిపై దృష్టిసారించారు. అన్ని ప్రాంతీయ రవాణా కార్యాలయాల్లోనే లింక్‌ ఆటోటెక్‌ యూనిట్‌లను ఏర్పాటు చేశారు. ఆర్టీఏ అధికారుల పర్యవేక్షణలో నంబర్‌ప్లేట్‌లను అందజేసేవిధంగా చర్యలు చేపట్టారు. దీంతో  2016 నుంచి కొంత మార్పు వచ్చింది.పెండింగ్‌ వాహనాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. అయినప్పటికీ  కనీసం 15 నుంచి 20 రోజుల పాటు వేచి ఉండాల్సి వచ్చేది. మరోవైపు ఈ జాప్యం కారణంగా వాహనదార్లే  హెచ్‌ఎస్‌ఆర్‌పీ పట్ల  విముఖత ప్రదర్శించారు. దీన్ని ఇప్పుడు అధిగమించే దిశగా రవాణా శాఖ అడుగులు వేస్తోంది.

మరింత పకడ్బందీగా...
తాజా  ఆదేశాలతో  బండి కొనుగోలు సమయంలో షోరూమ్‌లోనే  హైసెక్యూరిటీ నంబర్‌ప్లేట్‌ ఏర్పాటు చేసి ఇవ్వనున్న దృష్ట్యా వినియోగదారుడు  నిరాకరించే వీలుండదు. అంటే శాశ్వత రిజిస్ట్రేషన్‌తోనే వాహనం బయటకు వస్తుంది.వాహనం ఖరీదులో భాగంగానే దీనిని ఏర్పాటు చేసి ఇస్తారు. హెచ్‌ఎస్‌ఆర్‌పీ కోసం ప్రత్యేకంగా  అదనపు  రుసుము వసూలు చేయడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.శాశ్వత రిజిస్ట్రేషన్‌ల కోసం ఆర్టీఏ అధికారులను సంప్రదించవలసిన అవసరం ఉండదు. బండి విడుదలైన  వారం, పది రోజుల్లో  వాహన యజమాని ఇంటికే ఆర్సీ పత్రాలు స్పీడ్‌ పోస్టు ద్వారా చేరేలా చర్యలు తీసుకుంటారు. స్పెషల్‌ నంబర్‌లపైన ఆన్‌లైన్‌లో బిడ్డింగ్‌ నిర్వహించనున్నట్లు  అధికారులు తెలిపారు. అయితే ఇందుకోసం మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా