శుద్ధ జలంతో హైటెక్‌ సాగు

25 Sep, 2017 01:54 IST|Sakshi

మొక్కలకు బ్యాక్టీరియా సోకకుండా ఏర్పాట్లు

జీడిమెట్ల సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌.. హైటెక్‌ నర్సరీ కేంద్రం

రైతులకు ఆధునిక ఉద్యాన వ్యవసాయంపై శిక్షణ

క్యాప్సికం, జెరిబెర, కీర తదితర గ్రీన్‌హౌస్‌ పంటల సాగు

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో రాష్ట్ర ఉద్యాన శాఖ హైదరాబాద్‌ శివారు జీడిమెట్లలో ఏర్పాటు చేసిన సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీవోఈ)కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా 22 సీవోఈలు ఉంటే, రాష్ట్రంలో ఉన్నదే మొదటిస్థానంలో ఉన్నట్లు ఉద్యాన శాఖ వర్గాలు తెలిపాయి. బోరు నీటిని శుద్ధి చేసి.. హైటెక్‌ పద్ధతుల్లో వివిధ రకాల పంటలను సీవోఈలో సాగు చేస్తున్నారు.

బోరు నీటిలో ఉండే పంటలను నష్టపరిచే లవణాలను తొలగించేందుకు సీవోఈలో రూ.7.5 లక్షలతో రివర్స్‌ ఆస్మాసిన్‌ (ఆర్వో) ప్లాంటును ఏర్పాటు చేసి నీటిని శుద్ధి చేస్తుండటం విశేషం. రైతులకు శిక్షణతోపాటు సాగులో టెక్నాలజీ, సీజన్‌ బట్టి కూరగాయలు, పూల నర్సరీని అందిస్తున్నారు. ఇథియోపియా సహా పలు ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రతినిధులు దీన్ని సందర్శించారని ఉద్యాన శాఖ కమిషనర్‌ ఎల్‌.వెంకట్రామిరెడ్డి తెలిపారు.

కాళ్లు కడుక్కునే మొక్కల వద్దకు..
జీడిమెట్లలో 10.35 ఎకరాల్లో సీవోఈ విస్తరించి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసిన రూ.12.39 కోట్లతో రెండేళ్ల క్రితం ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. మొత్తం 17 గ్రీన్‌హౌస్, నెట్‌హౌస్, హైటెక్‌ గ్రీన్‌హౌస్‌లు ఇక్కడ ఉన్నాయి. క్యాప్సికం, కీర, టమాటా వంటి కూరగాయలు, జెరిబెర, గులాబీ, ఆర్చిడ్స్‌ వంటి పూలను సాగు చేస్తున్నారు. హైటెక్‌ గ్రీన్‌హౌస్‌లో టమాటా నర్సరీ తయారు చేసి రైతులకు విక్రయిస్తున్నారు. బోరు నీటిలో ఉండే ప్రమాదకర లవణాల ప్రభావం పూలు, కూరగాయల సాగుపై పడకుండా శుద్ధి చేస్తున్నారు.

సూక్ష్మసేద్యం ద్వారా మొక్కలకు పంపుతున్నారు. అలాగే కొన్ని రకాల మొక్కలకు 16 గంటల వరకు వెలుతురు అవసరం. ఆ మేరకు సాయంత్రం 6 తర్వాత ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైట్లతో కృత్రిమ వెలుతురు అందిస్తున్నారు. కొన్నిసార్లు వెలుగు తక్కువ ఉండి చీకటి అవసరం. అప్పుడు కృత్రిమ చీకటి సృష్టిస్తున్నారు. గ్రీన్‌హౌస్‌లోకి వెళ్లే వారు గేటు వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పొటా షియం పర్మాంగనేట్‌ ద్రావణంలో కాళ్లు కడుక్కొని వెళ్లాలి. కాళ్లకు ఉండే బ్యాక్టీరియా మొక్కలకు సోకకుండా ఈ శ్రద్ధ తీసుకుంటున్నారు.

10 వేల మందికి శిక్షణ.. రూ.16 కోట్ల ఆదాయం లక్ష్యం
సీవోఈ ద్వారా 2021 నాటికి రూ.16 కోట్ల ఆదాయాన్ని  సేకరించాలని ఉద్యాన శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కాలంలో 10 వేల మంది రైతులకు, ఉద్యానాధికారులకు శిక్షణ ఇచ్చేలా ప్రణాళిక రూపొందించుకుంది. సీవోఈకి అంతర్జాతీయ స్థాయి ఖ్యాతి దక్కేలా అత్యాధునిక సాంకేతిక పద్ధతులను ప్రవేశపెడుతున్నామని ఉద్యాన శాఖ కమిషనర్‌  వెంకట్రామిరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

మరిన్ని వార్తలు