సెగలు గక్కుతున్న సూర్య

20 May, 2015 05:09 IST|Sakshi

గనుల వద్ద 47 డిగ్రీల ఉష్ణోగ్రత
మార్చి నుంచి ఇప్పటివరకు వడదెబ్బతో 40 మంది మృత్యువాత
రోజురోజుకు పెరుగుతున్న ఎండలు

ఆదిలాబాద్ అగ్రికల్చర్ : భానుడు భగభగమండుతున్నాడు. జిల్లా అగ్నిగోళంలా మండుతోంది. గరిష్ట ఉష్ణోగ్రతలు దినదినం పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు బయటికి వచ్చేందుకు భయపడుతున్నారు. ప్రచండ భానుడి ఉగ్రరూపాన్ని తాళలేక పలువురు పిట్టల్లా రాలిపోతున్నారు. మంగళవారం ఒక్కరోజే జిల్లాలో 44.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం ఆందోళన కలిగించే  విషయం. ఈ ఏడాది ఇప్పటివరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రత కావడం విశేషం. మూడు రోజులుగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. జిల్లాలో వడదెబ్బ ధాటికి మార్చి నుంచి ఇప్పటివరకు 40 మంది మృతిచెందారు. ఒక్క మే నెలలోనే ఇప్పటివరకు 24 మంది మృత్యువాతపడ్డారు. రోజుకు ఇద్దరు.. ముగ్గురు చొప్పున వడదెబ్బకు గురవుతూ చనిపోతూనే ఉన్నారు. మంగళవారం ఒక్కరోజే ముగ్గురు మృత్యువాతపడ్డారు.
 
 ఉదయం 9 గంటల నుంచే సూర్యప్రతాపం ప్రారంభమవుతోంది. ఇక ఈ గరిష్ట ఉష్ణోగ్రతలు తూర్పు ప్రాంతంలోని బొగ్గు గనుల పరిధిలో మరింత తీవ్రంగా ఉన్నాయి. బొగ్గు గనులు ఉన్న ప్రాంతాల్లో మంగళవారం పగటి ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలకు చేరింది. దీంతో ఓపెన్ కాస్టుల్లో విధులు నిర్వర్తించే కార్మికులు అల్లాడిపోతున్నారు. అడవులు అంతరిస్తుండటం.. జలాశయాల్లో నీరు అడుగంటడం.. తదితర కారణాలతో ఎండ తీవ్రత ఏటా పెరుగుతోంది. వారం క్రితం జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో వర్షం పడి వాతావరణం చల్లగా ఉండేది. శనివారం నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 11 గంటలు దాటితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. సాయత్రం 6 గంటలు దాటితే కాని ప్రజలు బయటికి రాలేకపోతున్నారు. వాహన చోదకులు ముఖానికి రక్షణ లేకుండా బయటకు వచ్చే పరిస్థితి లేదు.
 
భానుడు.. బ్యాండ్ భాజా..
ఇదే నెలలో అత్యధికంగా పెళ్లిళ్లు ఉన్నాయి. ఇటు ఎండలతో ఇళ్లలో ఉక్కపోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంటే.. పెళ్లిళ్లకు వెళ్లిన వారు ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణాలు చేసేవారు, శుభకార్యాలకు పత్రికలు పంచేవారు, దూర ప్రాంతాల వివాహాలకు హాజరయ్యే వారు వడదెబ్బ బారిన పడుతున్నారు. వేసవిలో శ్రీరామనవమితో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమైంది. వైశాఖమాసంలో దివ్యమైన ముహూర్తాలు ఉన్నాయి. ఈ నెలలో 20,21,22,28,29,30,31, జూన్ 1,3,5,6,7,10, తేదీల్లో పెళ్లిళ్లు ఎక్కువగా జరగనున్నాయి.
 
 ప్రయాణాలు చేసేటప్పుడు..

 •   శరీరాన్ని పట్టుకునేలా ఉండే దుస్తులను కాకుండా కొద్దిగా వదులుగా ఉండేలా ధరించాలి. దీంతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందవచ్చు.
 •  సాధ్యమైనంత మేరకు ఉదయం చల్లగా ఉన్న సమయంలోనే వివాహాలకు బయల్దేరాలి. అక్కడ బంధువులతో కాలక్షేపం చేస్తూ సాయంత్రం వరకు ఉంటే మేలు.
 •  ముఖ్యంగా వ్యాన్, లారీల్లో వెళ్లాల్సి వస్తే.. వాటిపై తాటిపత్రిలాంటివి వేసుకోవాలి. అంతేకాకుండా ఇరుకుగా కాకుండా తక్కువ మోతాదులో మందిని తరలించేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇరుకుగా ఉండడం వల్ల గాలి రాకుండా.. శ్వాస ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.
 •  పెళ్లికి వెళ్లే సమయంలో తప్పనిసరిగా తగినంత మేర చల్లని నీటిని వెంట తీసుకెళ్లాలి.
 •  వాహనాలపై వెళ్లాల్సి వస్తే తలకు, ముక్కుకు, చెవులకు నిండుగా ఉండేలా కాటన్ టవల్, కర్చీప్ కట్టుకోవాలి. కళ్లకు చల్లని చలువ అద్దాలు పెట్టుకోవాలి. గొడుగు, టోపి ధరించాలి.
 •  నీళ్లు, పండ్ల రసాలు తీసుకోవాలి.
 •  ఎండలో తిరిగి వచ్చిన వెంటనే బాగా చల్లని నీరు ఒకేసారి తీసుకోకూడదు
 •  త్వరగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారం, పండ్లు, కూరగాయలు తీసుకోవాలి.
 •   తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు నీరు తాగాలి.
 •  నిమ్మరసంలో ఉప్పు, చక్కెర కలిపి తీసుకోవాలి.
 •  ఎక్కువ వేడి గాలిలో తేమ ఎక్కువగా ఉన్న సమయంలో పనులు తగ్గించుకోవాలి.
 •  సోడియం, పొటాషియం ఉన్న ద్రవ పదార్థాలు తీసుకోవాలి.
 •  వడదెబ్బకు గురైన వారిని చల్లని లేదా నీడ ప్రదేశానికి తీసుకెళ్లాలి.
 •  నుదుటిపై తడిగుడ్డ వేసి తుడుస్తూ శరీర ఉష్ణోగ్రతను తగ్గించాలి.
 •  బీపీ లేదా పల్స్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి.
 •  గాలి ఎక్కువగా తగిలేలా చూడాలి.
 •  నీరు ఎక్కువగా తాగించాలి.
 •  కొవ్వు పదార్థాలకు దూరంగా ఉండాలి
 •  ముఖ్యంగా చికెన్, మటన్, బిర్యానీ, ఆయిల్ ఫుడ్, మాసాల, ఫ్రై వంటివి తీసుకోరాదు.
 •  ఆల్కహాల్‌తో మరింతగా ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది.
 •  అవసరాన్ని బట్టి వైద్యుడికి చూపించి ప్రాథమిక చికిత్స అందజేయాలి.
 •  సాధ్యమైనంత మేర చిన్నారులకు నీళ్లు ఎక్కువగా తాగించాలి.
 •  రాత్రి వేళల్లో వడగాలులు వీచినా, వేడి ఎక్కువగా ఉన్నా చిన్నారులను బయట పడుకోబెట్టకూడదు.
 •  చిన్నారుల శరీరం వేడిగా అనిపిస్తే తడిగుడ్డతో తుడవాలి.
 •  ఓఆర్‌ఎస్ వంటి ద్రావణాన్ని తాగించాలి.
 •  ఏ మాత్రం అనారోగ్యం అనిపించినా వెంటనే వైద్యుల వద్దకు తీసుకెళ్లి చికిత్స చేయించాలి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా