గాంధీ భవన్‌ వద్ద హైటెన్షన్‌

11 Nov, 2018 15:19 IST|Sakshi
గాంధీ భవన్‌ వద్ద కాంగ్రెస్‌ కార్యకర్తల ఆందోళనలు

ఇతర పార్టీలకు టిక్కెట్లు ఇవ్వదంటూ కార్యకర్తల ఆందోళన

గాంధీ భవన్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితి

మూడో రోజుకు చేరుకున్న ఖానాపూర్‌ నేతల దీక్ష

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల ఆందోళనతో గాంధీ భవన్‌ అట్టుడుకుతోంది. టిక్కెట్ల కోసం ఆ పార్టీ కార్యకర్తలు చేస్తున్న నిరసనలు మూడోరోజు ఉద్రిక్త వాతావరణంలో కొనసాగుతున్నాయి. రేపోమాపో  అభ్యర్థులను ఖరారు చేయనున్న నేపథ్యంలో అసంతృప్తుల నిరసనలు పార్టీకి కొత్త సమస్యలు తెచ్చిపెడుగతున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా ఖానాపూర్‌ సీటు మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌కు ఇవ్వదంటూ ఆపార్టీ నేతలు చేస్తున్న నిరహార దీక్షలు మూడోరోజుకు చేరుకున్నాయి. ఆ స్థానాన్ని హరినాయక్‌కు కేటాయించాలని ఆయన మద్దతుదారులు ఆందోళల చేస్తున్నారు. గత మూడు రోజులుగా దీక్ష చేస్తున్న ఖానాపూర్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఆదివారం వైద్య పరీక్షలు నిర్వహించారు. మేడ్చల్‌ జిల్లా మల్కాజిగిరి స్థానంపై ఉత్కంఠ వీడలేదు. పొత్తులో భాగంగా ఆ సీటును టీజేఎస్‌కు కేటాయిస్తే ఖచ్చితంగా ఓడిపోక తప్పదని కార్యకర్తలు గాంధీ భవన్‌ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పటాన్‌ చెరు టిక్కెట్‌ను వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జే. రాములుకు కేటాయించాలని ఆయన మద్దతుదారులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇక  ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కీలకంగా మారిన వేములవాడ సీటును ఆది శ్రీనివాస్‌కు ఇవ్వదని.. అనేక పార్టీలు మారిన ఆయనకు టిక్కెట్‌ ఎలా ఇస్తారని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. వేములవాడ టిక్కెట్‌ను ఏనుగు మనోహర్‌రెడ్డికి కేటాయించాలని ఆయన మద్దతుదారులు ఆందోళన చేస్తున్నారు. వరంగల్‌ వెస్ట్‌ స్థానంపై ఆందోళన కొనసాగుతున్నాయి.. పొత్తులో భాగంగా ఆ సీటు​ టీడీపీ కేటాయించవద్దని కార్యకర్తలు గాంధీ భవన్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాల నుంచి పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్‌కు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కార్యకర్తల పెద్ద మొత్తంలో చేరుకోవడంతో ధర్నాలకు స్థలంకూడా సరిపోవ్వడం లేదు. ఇదిలావుండగా అసంతృప్తులను బుజ్జగించే పనిలో నాయకత్వం నిమగ్నమైంది.

మరిన్ని వార్తలు