ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడి

26 Jul, 2014 02:44 IST|Sakshi

దేవరకద్ర :  వ్యవసాయంలో రైతులు ఆధునిక పద్ధతులను పాటించి అధిక దిగుబడిని పొందాలని జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు భగవత్ స్వరూప్ సూచించారు. శుక్రవారం మండలంలోని బస్వాపూర్‌లో ఆత్మ ఆధ్వర్యంలో సేంద్రియ ఎరువుల వాడకంపై రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఎరువుల వాడకంలో సమతుల్యత పాటించాలని, కాంప్లెక్స్ ఎరువులు తగ్గించి సేంద్రియ ఎరువులను వాడితే నేల సారంవంతం అవుతుందన్నారు.

వర్షాకాలం ప్రారంభంలో జీలుగను సాగు చేసుకోవాలని, విత్తనాలను శుద్ధి చేసుకుంటే చీడ పీడల నుంచి రక్షణ పొందవచ్చన్నారు. చౌడు నేలలు సారవంతం కావడానికి చౌడును తగ్గించడానికి జిప్సము వాడాలని, వరి పంటల్లో కాలిబాటలు తీయాలని దీని వల్ల రసం పీల్చే పురుగుల ఉధృతిని తగ్గించవచ్చని సూచించారు. పోటాష్ వాడకం వల్ల మొక్కల వేర్లు పెరుగుదల బాగుంటుందని, పొట్టదశలో వాడితే మొక్కలు బలంగా ఉంటాయని, దిగుబడి కూడా పెరుగుతుందని తెలిపారు. సమావేశంలో మండల వ్యవసాయ అధికారి కిరణ్‌కుమార్, విస్తీర్ణాధికారులు సుజాత, మంజుల, ఎన్‌జీఓస్ బాల్‌రాజు, శ్రీనివాస్, బాలగౌడ్ పాల్గొన్నారు.

 సేంద్రియ ఎరువులనే వాడండి
 అమ్రాబాద్ : సేంద్రియ ఎరువులతో భూసారాన్ని కాపాడుకోవచ్చని, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులను విరివిగా వాడాలని వ్యవసాయశాఖ ఏడీఏ సరళకుమారి అన్నారు. ఆదర్శ మహిళాసంఘం ఆధ్వర్యంలో శుక్రవారం అమ్రాబాద్‌లో సేంద్రియ ఎరువులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సేంద్రియ ఎరువుల  వినియోగం, లాభాలు, రసాయన ఎరువులతో కలిగే నష్టాల గురించి వివరించారు. పచ్చిరొట్ట ఎరువులు, వర్మీకంపోస్టు, వేప కశాయం తయారీ గురించి వివరించారు. నేల స్వభావాన్ని బట్టి పంటలను వేసుకోవాలని, ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో ఆదర్శమహిళాసంఘం అధ్యక్షురాలు అంతమ్మ, చైతన్య రైతు మిత్ర సోసైటీ చెర్మైన్ ఆంజనేయులు, రైతులు పాల్గొన్నారు.

 ఆరుతడి సాగే మేలు
 పెబ్బేరు : ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలని మండల వ్యవసాయాధికారి కుర్మయ్య కోరారు. శుక్రవారం యాపర్ల గ్రామంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఖరీప్ సాగుకు అనుకూలంగా వర్షాలు కురవక పోవడంతో రైతులు కందులు, మొక్కజొన్న, జొన్న తదితర ఆరుతడి పంటలను సాగుచేసుకోవాలని సూచించారు. అనంతరం ఉల్లి, మొక్కజొన్న పంటలను పరిశీలించి సూచనలిచ్చారు. ఆయన వెంట సర్పంచ్ నారాయణ, ఎంపీటీసీ సభ్యులు గౌరమ్మ, తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు