కూల్చివేతకు లైన్‌క్లియర్‌

18 Jul, 2020 02:16 IST|Sakshi

పిల్‌ కొట్టేస్తూ హైకోర్టు తీర్పు

మంత్రిమండలి తీర్మానం మేరకే సచివాలయం కూల్చివేత

పర్యావరణ అనుమతి అక్కర్లేదు

సాక్షి, హైదరాబాద్ ‌: సచివాలయం భవ నాల కూల్చివేతకు లైన్‌క్లియర్‌ అయ్యింది. గత వారం రోజులుగా కూల్చివేత పను లపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ప్రస్తుతం ఉన్న భవనాల కూల్చివేతకు ఎటువంటి ముందస్తు అనుమతి అవస రం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. భూమిని సిద్ధం చేయడం (ప్రిపరేషన్‌ ఆఫ్‌ ల్యాండ్‌) అంటే భవనాలను కూల్చి వేయం కూడా వస్తుందని, ఇందుకు అనుమతి అవసరమన్న పిటిషనర్‌ వాదనను తోసిపుచ్చింది. ఈ వాదనను నిరూపించేందుకు ఎటువంటి ఆధారాలను, తీర్పులను పిటిషనర్‌ సమర్పించలేదని పేర్కొంది.

నూతన నిర్మాణాలకు మాత్రమే కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతులు ఉండాలని పేర్కొంది. పునాదుల కోసం భూమిని తవ్వే ముందు మాత్రమే అనుమతులు ఉండాలని, కూల్చివేతలకు వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం కింద స్థానిక సంస్థల అనుమతి ఉంటే సరిపోతుందని పర్యావరణ శాఖ పేర్కొన్న విషయాన్ని గుర్తు చేసింది. కోవిడ్‌ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి కూల్చివేత పనులు చేపట్టాలని ఆదేశించింది. సచివాలయం కూల్చివేత నిబంధనలకు విరుద్దంగా చేస్తున్నారంటూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, జస్టిస్‌ బి.విజయసేన్‌ రెడ్డిలతో కూడిన ధర్మాసనం శుక్రవారం కొట్టివేసింది.

సరైన అనుమతులు లేకుండానే సచివాలయ భవనాలను కూల్చివేస్తున్నారని, వీటిని ఆపాలంటూ ప్రొఫెసర్‌ పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, డాక్టర్‌ చెరుకు సుధాకర్‌లు దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారించింది. సచివాలయం భవనాల కూల్చివేతకు అనుమతులు అవసరం లేదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారని అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎన్‌.రాజేశ్వర్‌రావు నివేదించారు. ఈ మేరకు కేంద్ర పర్యావరణ అధికారులు సమర్పించిన లేఖను ధర్మాసనానికి సమర్పించారు. ఈ వాదనతో ధర్మాసనం ఏకీభవిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. 

సచివాలయం కూల్చివేసి కొత్తది నిర్మించాలన్న విషయంలో మంత్రిమండలి తుది నిర్ణయం తీసుకోలేదని పిటిషనర్‌ వాదనలు వినిపించారని, అయితే జూన్‌ 30న ఈ మేరకు మంత్రి మండలి తీర్మానం చేసిందని, ఈ తీర్మానం ప్రతిని ఏజీ సమర్పించారని ధర్మాసనం తీర్పులో పేర్కొంది. భద్రతా కారణాల రీత్యా ప్రస్తుత సచివాలయాన్ని కూల్చివేసి అత్యాధునిక హంగులతో, మంచి నిర్మాణ శైలితో నూతన భవనాలను నిర్మించాలని మంత్రి మండలి చేసిన తీర్మానాన్ని పరిశీలించామని వివరించింది. ఈ నేపథ్యంలో మంత్రిమండలి తుది నిర్ణయం లేకుండానే కూల్చివేత పనులు చేపడుతున్నారన్న పిటిషనర్‌ వాదన సరికాదని స్పష్టం చేసింది.

కూల్చివేత సమయంలో వచ్చే వ్యర్థాలను తొలగించే విషయంలో సంబంధిత అధికారుల నుంచి అనుమతులు లేవన్న పిటిషనర్‌ వాదననూ ధర్మాసనం తోసిపుచ్చింది. రోడ్లు భవనాల శాఖ చీఫ్‌ ఇంజనీర్‌ ఈ మేరకు జీహెచ్‌ఎంసీ నుంచి ఈనెల 4న అనుమతులు తీసుకొని 7వ తేదీ నుంచి కూల్చివేత పనులు ప్రారంభించారని పేర్కొంది. కరోనా విజృంభిస్తున్న విపత్కర పరిస్థితుల్లో కూల్చివేతలు చేపట్టరాదని పిటిషనర్‌ వాదిస్తున్నారని అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీచేసిన మార్గదర్శకాల్లో ఎక్కడా కూల్చివేత పనులు చేపట్టరాదని లేదని పేర్కొంది. కూల్చివేతలతో వెలువడే దుమ్ము, ధూళితో కాలుష్యం ఏర్పడుతోందని, సచివాలయం సమీపంలోని ప్రజలకు స్వచ్ఛమైన గాలి పీల్చుకునే పరిస్థితి లేకుండా వారికున్న ప్రాథమిక హక్కులను హరిస్తున్నారన్న పిటిషనర్‌ తరఫు వాదననూ ధర్మాసనం తోసిపుచ్చింది. పిటిషనర్‌ లేవనెత్తిన ఇతర అభ్యంతరాలకు సరైన ఆధారాలు చూపలేదని ధర్మాసనం పేర్కొంది. నూతన భవనాల నిర్మాణ సమయంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకుంటామని అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ తెలిపారు. వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం నిబంధనల మేరకే అనుమతులు తీసుకొని వ్యర్థాలను తరలిస్తున్నామని వివరించారు. 

మరిన్ని వార్తలు