అసెంబ్లీ రద్దుపై హైకోర్టులో ముగిసిన వాదనలు

10 Oct, 2018 14:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయనే పిటిషన్‌పై విచారణను హైకోర్టు ఈ నెల12కి వాయిదా వేసింది. ఓటరు జాబితాలో అభ్యంతరాలను నివృత్తి చేయడానికి ఎలాంటి మార్గదర్శకాలు పాటిస్తారో అఫిడవిట్ రూపంలో కోర్టుకు తెలపాలని ఎన్నికల కమిషన్‌ని హైకోర్టు ఆదేశించింది.  బూత్‌ లెవెల్‌ నుంచి ఓటర్ల జాబితాపై అఫిడవిట్‌లో వివరాలు పొందుపరచాలని కోరింది. ఓటర్ల తుది జాబితాను ఈనెల 12న ప్రచురించేందుకు ఎన్నికల సంఘానికి హైకోర్టు అనుమతినిచ్చింది. అసెంబ్లీ రద్దు పిటిషన్లపై వాదనల అనంతరం తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది.

కాగా అంతకుముందు తెలంగాణ ఓటర్ల జాబితాపై దాఖలైన పిటిషన్లపై బుధవారం హైకోర్టులో వాదోపవాదాలు సాగాయి. ఓటరు నమోదు ప్రక్రియపై నిబంధనలు ఏం చెబుతున్నాయనే వివరాలు అందించాలని ప్రధాన న్యాయమూర్తి ఈసీని ఆదేశించారు. ఓటరు నమోదు నిబంధనలపై పూర్తి వివరణ ఇవ్వాలని ఈసీని ఆదేశించారు. తెలంగాణ ఓటర్ల జాబితాపై దాఖలైన అన్ని పిటిషన్‌లను మధ్యాహ్నం 2.15 గంటలకు వాయిదా వేశారు.

ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి పిటిషన్‌పై ఈసీ ఇప్పటికే కౌంటర్‌ దాఖలు చేసింది. ఈసీ కౌంటర్‌పై మర్రి శశిధర్‌ రెడ్డి న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ వాదనలు వినిపించనున్నారు. కాగా ఓటర్ల జాబితాపై కోర్టులో విచారణ సాగుతుండగానే ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించగా, కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ముందస్తు అసెంబ్లీ రద్దును సవాల్‌ చేస్తూ మాజీ మంత్రి డీకే అరుణ సహా పలువురు దాఖలు చేసిన పలు పిటిషన్లపై బుధవారం విచారణ జరగనుంది.

మరిన్ని వార్తలు