మే నెలాఖరులోగా అన్ని సెట్స్‌!

20 Dec, 2017 04:01 IST|Sakshi

జూలై నాటికి ప్రవేశాలు పూర్తి చేసేలా ప్రణాళిక

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే విద్యా సంవత్సరం వివిధ వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించనున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలను (సెట్స్‌) ఏప్రిల్‌ చివరి వారంలో ప్రారంభించి మే నెలాఖరులోగా పూర్తి చేసేలా ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. జూన్‌లో ప్రవేశాలను చేపట్టి ఎట్టి పరిస్థితుల్లో జూలైలోగా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో సెట్స్‌ కన్వీనర్ల ఎంపికపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఏయే ప్రవేశ పరీక్షను ఏయే యూనివర్సిటీ నిర్వహించాలో ఖరారు చేసింది. సెట్స్‌కు కన్వీనర్లుగా నియమించేందుకు పేర్లను పంపించాలని రెండు రోజుల కిందట ఆయా యూనివర్సిటీలకు ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి లేఖలు రాశారు. ఈ మేరకు వర్సిటీల నుంచి పేర్ల జాబితా రెండు మూడు రోజుల్లో రానుంది. యూనివర్సిటీలు పంపే మూడు పేర్లలో ఒకరిని కన్వీనర్‌గా నియమిస్తూ అధికారిక ప్రకటన వెలువడనుంది.  

పాత కన్వీనర్లే మేలు!
2017 విద్యా సంవత్సరంలో ప్రవేశ పరీక్షలను నిర్వహించిన కన్వీనర్లనే 2018లోనూ నియమించాలని యూనివర్సిటీలు భావిస్తున్నాయి. తద్వారా ఎలాంటి సమస్యలు లేకుండా ప్రవేశ పరీక్షలను నిర్వహించవచ్చని భావిస్తున్నాయి. ఈ మేరకు ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (పీఈ) సెట్‌ కన్వీనర్‌కు ప్రతిపాదించిన పేర్ల జాబితా ఉన్నత విద్యా మండలికి మంగళవారమే అందింది. 2017లో పీఈసెట్‌ను విజయవంతంగా నిర్వహించిన ప్రొఫెసర్‌ సత్యనారాయణను 2018లోనూ కన్వీనర్‌గా నియమించాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఇక అగ్రికల్చర్, ఇంజనీరింగ్‌ ప్రవేశాలకు ఎంసెట్‌ నిర్వహణ బాధ్యతలను ఈసారి కూడా ప్రొఫెసర్‌ యాదయ్యకే అప్పగించేలా జేఎన్‌టీయూ ప్రతిపాదిస్తున్నట్లు తెలిసింది. ఉన్నత విద్యా మండలి కూడా ఇదే అభి ప్రాయంతో ఉండటంతో మిగతా సెట్స్‌కు దాదాపు పాత కన్వీనర్లే ఖరారయ్యే అవకాశం ఉంది.  

రెండింటికి కొత్త వారు..
న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే లాసెట్, ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్‌ను 2017లో నిర్వహించిన కన్వీనర్లు పదవీ విరమణ పొందారు. దీంతో ఈసారి ఆ రెండింటికి కన్వీనర్లు మారనున్నారు. మరోవైపు 2017లో లాసెట్‌ను కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించగా, 2018లో నిర్వహణ బాధ్యతలను  ఓయూకు అప్పగిస్తూ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది.
సెట్స్‌ వారీగా నిర్వహణ యూనివర్సిటీలు, కన్వీనర్లు

సెట్‌                 యూనివర్సిటీ                      కన్వీనర్‌
ఎంసెట్‌             జేఎన్‌టీయూ                     యాదయ్య
ఈసెట్‌              జేఎన్‌టీయూ                       గోవర్ధన్‌
పీజీఈసెట్‌         ఉస్మానియా                    సమీన్‌ ఫాతిమా
ఐసెట్‌                కాకతీయ                       కొత్తవారు
లాసెట్‌             ఉస్మానియా                     కొత్తవారు
ఎడ్‌సెట్‌            ఉస్మానియా                   దమయంతి
పీఈసెట్‌         మహాత్మాగాంధీ               సత్యనారాయణ

మరిన్ని వార్తలు