700 కాలేజీల్లో 25 శాతంలోపే ప్రవేశాలు

25 Oct, 2017 02:45 IST|Sakshi

డిగ్రీ ప్రవేశాల లెక్కలు తేల్చిన ఉన్నత విద్యామండలి  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 25 శాతంలోపు ప్రవేశాలు జరిగిన కాలేజీల లెక్కలు తేలాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి డిగ్రీ ప్రవేశాలపై ప్రాథమిక గణాంకాలు సేకరించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల కాలేజీల్లో 25 శాతంలోపే ప్రవేశాలు జరిగినట్లు గుర్తించింది. ఇందులో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు సైతం 100 వరకు ఉన్నాయి.

కొన్ని బ్రాంచీల వారీగా పరిశీలిస్తే పలు కాలేజీల్లో ప్రవేశాలే జరగలేదు. నాణ్యతా ప్రమాణాలు, సౌకర్యాల కల్పన దృష్ట్యా వీటిలో ప్రవేశాలు తగ్గినట్లు ఉన్నత విద్యామండలి భావిస్తోంది. దీంతో ఈ కాలేజీలకు వచ్చే ఏడాది అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించినట్లు తెలిసింది.

కాలేజీలకు గుర్తింపు ఉండాలంటే తప్పకుండా నాణ్యత ప్రమాణాలు పాటించాలని ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 25 శాతం ప్రవేశాలు ఉండాలనే నిబంధనను సైతం పెట్టింది. తాజాగా నిర్దేశిత సంఖ్య కంటే తక్కువ ప్రవేశాలు నమోదు కావడంతో ఉన్నత విద్యామండలి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు