‘ఉన్నత’ నిర్లక్ష్యం..

27 Jul, 2014 00:26 IST|Sakshi
‘ఉన్నత’ నిర్లక్ష్యం..

►పీజీ విద్యకు దూరమవుతున్న విద్యార్థులు
►కళాశాల మంజూరులో పాలకుల నిర్లక్ష్యం
 బెల్లంపల్లి : ఉన్నత విద్యపై పాలకులు ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో విద్యార్థుల కు అందుబాటులో పోస్టుగ్రాడ్యుయేషన్ (పీజీ) కళాశాలలను ఏర్పాటు చేయాల్సి ఉండగా పట్టింపు లేకుండా ఉన్నారు. ఏళ్ల తరబడి నుంచి విద్యార్థులు పీజీ కళాశాల మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఫలితంగా నిరుపేద విద్యార్థు లు ఇంటర్, డిగ్రీ చదువులతోనే సరిపెట్టుకుంటున్నారు. ఉన్నత విద్యకు దూరమవుతున్నారు.
 
26 మండలాల్లో ఏకైక కళాశాల
తూర్పు ప్రాంతంలో ఆసిఫాబాద్, సిర్పూర్(టి), బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూర్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో 26 మండలాలు ఉండగా ఇందులో కేవలం మంచిర్యాలలో మాత్రమే ప్రభుత్వ పీజీ కళాశాల ఉంది. మిగతా నాలుగు నియోజకవర్గాల్లో పీజీ కళాశాలలు మంజూరుకు నోచుకోలేకపోతున్నాయి. చెన్నూర్, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, మంచిర్యాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా సిర్పూర్(టి)లో ఎయిడెడ్, ఆసిఫాబాద్‌లో ప్రైవేట్ రంగంలో డిగ్రీ కళాశాలలను నిర్వహిస్తున్నారు. ప్రతి మండలానికొక జూనియర్ కళాశాలను మంజూరు చేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన ఆచరణలో విఫలమైంది.

ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎనిమిది మండలాలు ఉండగా వీటిలో ఐదు మండలాల్లో మాత్రమే జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాంకిడి, తిర్యాణి, రెబ్బెన మండలాల్లో ప్రభుత్వం జూనియర్ కళాశాలలను ఏర్పాటు చేయలేదు. చెన్నూర్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో మూడింటిలో మాత్రమే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటయ్యాయి. కోటపల్లి మండలంలో జూనియర్ కళాశాల మంజూరు కావడం లేదు.

సిర్పూర్(టి) నియోజకవర్గంలోని ఐదు మండలాలకు గాను రెండు మండలాల్లో మాత్రమే జూనియర్ కళాశాలలు ఉన్నాయి. బెజ్జూరు, దహెగాం, సిర్పూర్(టి) మండలాల్లో జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నా నిర్లక్ష్యం జరుగుతోంది. బెల్లంపల్లి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో కేవలం రెండింటిలో మాత్రమే ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటయ్యాయి. వేమనపల్లి, నెన్నెల, భీమిని, తాండూర్ మండలాల్లో ఇంత వరకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మంజూరైన పాపాన పోవడం లేదు. మంచిర్యాల నియోజకవర్గంలో మాత్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మండలానికొకటి ఏర్పాటయ్యాయి.
 
పీజీ కోసం...
ఐదు నియోజకవర్గాల్లో ప్రతి ఏటా సుమారు 20 వేల నుంచి 25 వేల మంది వరకు విద్యార్థులు పదో తరగతి ఉత్తీర్ణులవుతుండగా ఇందులో సుమారు 15 వేల నుంచి 20 వేల మంది ఇంటర్మీడియెట్‌లో చేరుతున్నారు. 10 వేల నుంచి 15 వేల మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ పూర్తి చేసుకుంటుండగా వీరిలో 4 నుంచి 6 వేల మంది విద్యార్థులు డిగ్రీ చదువుతున్నారు. డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులు 3 నుంచి 4 వేల మంది పీజీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.

నియోజకవర్గాల్లో పీజీ కళాశాలలు లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు చదువుపై శ్రద్ధ ఉన్న ఇతర ప్రాంతాలకు వెళ్లి విద్యాభ్యాసం చేసే అవకాశాలు లేక అర్థంతరంగా చదువును ఆపేస్తున్నారు. కొంత మంది విద్యార్థులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. బాలికలు పై చదువులకు నోచుకోలేకపోతున్నారు. పీజీ కళాశాలలు లేక ఆ తీరుగా విద్యార్థులు చదువు ‘కొన’లేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నియోజకవర్గానికొక పీజీ కళాశాలను మంజూరు చేసి విద్యార్థుల ఆశను నెరవేర్చాలని పలువురు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు