‘ఆధార్‌’లో బాద్‌షా!

30 Oct, 2017 01:40 IST|Sakshi

దేశంలోనే అత్యధికంగా హైదరాబాద్‌లో ఆధార్‌ నమోదు శాతం

సాక్షి, హైదరాబాద్‌: రోజురోజుకూ విస్తరిస్తున్న భాగ్య నగరం ‘ఆధార్‌’నమోదు శాతంలో బాద్‌షాగా నిలిచింది. దేశంలోనే హైదరాబాద్‌ నగరం అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం మహానగరంలో ఉన్న జనాభా కంటే అధికంగా ఆధార్‌ నమోదు చేసుకున్నట్లు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2011 నాటికి హైదరాబాద్‌ జనాభా 93 లక్షలుకాగా.. 2017 సెప్టెంబర్‌ చివరి నాటికి ఆధార్‌ జారీ అయిన వారి సంఖ్య 1.09 కోట్లకు చేరింది.

దాదాపు 17.66% అధికంగా ఆధార్‌ యూఐడీలు జారీ అయినట్లు తేలుతోంది. బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌కు వలస వస్తుండడంతో ఇక్కడి జనాభా వేగంగా పెరుగుతోంది. దీంతో 2011 నాటి జన సంఖ్య కంటే ఎక్కువ శాతంలో ఆధార్‌ నమోదైనట్లు అంచనా వేస్తున్నారు. ఇక ఆధార్‌ నమోదు శాతంలో దేశ రాజధాని ఢిల్లీ రెండో స్థానంలో నిలవగా.. ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్‌కతాలు వరుసగా తర్వాతి స్థానాలు పొందాయి. ఢిల్లీలోనూ జనాభా కంటే 16 శాతం అధికంగా ఆధార్‌ నమోదైంది.

ఇంతింతై.. జనమింతై..
హైదరాబాద్‌ మహా నగరంలో జనాభా ఏటికేడు భారీగా పెరిగిపోతోంది. ఇప్పటికే దాదాపు 1.09 కోట్లకుపైగా జనాభా ఉన్న భాగ్య నగరం.. 2020 నాటికి దేశంలోనే రెండో అత్యధిక జనాభా గల నగరంగా ఆవిర్భవించనున్నట్లు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌ ఐటీ, హెల్త్, పారిశ్రామిక హబ్‌గా మారడంతో ఉపాధి అవకాశాలకు కేంద్ర బిందువైంది. మరోవైపు నిర్మాణ రంగ కార్మికులూ అధికంగా హైదరాబాద్‌ బాట పట్టారు. అన్ని ప్రాంతాల వారు నివసించేందుకు అనువైన వాతావరణం, మిగతా నగరాలతో పోలిస్తే జీవన వ్యయం తక్కువ కావడం, అన్ని భాషల వారితో కలుపుగోలుతనం తదితర కారణాలతో వలసలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి.

మరిన్ని వార్తలు