మేమూ మనుషులమే

5 May, 2018 10:10 IST|Sakshi
ఇళ్ల కోసం మంత్రి హరీశ్‌రావు, కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డికి వినతిపత్రం ఇస్తున్న హిజ్రాలు

మమ్మల్ని గుర్తించండి

ఉండడానికి ఇళ్లు మంజూరు చేయండి

పెన్షన్‌ సదుపాయం కల్పించండి

ప్రభుత్వాన్ని వేడుకుంటున్న హిజ్రాలు

సిద్దిపేటటౌన్‌: కనిపించగానే చనువుగా మాట్లాడుతారు. చప్పట్లు కొడుతూ చుట్టూ తిరుగుతూ డబ్బులివ్వమని అడుగుతారు. కొన్ని సార్లు బెదిరిస్తారు. వారిని చూసి జాలిపడే వారి కన్నా . ఎంతో కొంత ఇచ్చి వదిలించుకుందామనుకునే వారే ఎక్కువ. ఎంత కోపంతో ఇచ్చినా ఆశీర్వదించి వెళ్తారు. వాళ్లే ‘హిజ్రా’లు. కుటుంబ సభయులు వెలేసినా, సమాజం దూరం పెడుతున్నా, ప్రభుత్వాలు పట్టించుకోకున్నా బతుకు పోరాటం చేస్తున్న హిజ్రాల దీన గాథపై కథనం..

గూడు కోసం గోస..
వీరికి ఉండడానికి సొంత ఇల్లులు ఉండవు. కిరాయికి ఇవ్వడానికి సైతం ఎవరూ ముందుకు రారు. ఆడ, మగ కాకపోయినా సమాజంలో తాము భాగమేనని, తాము కూడా మనుషులమేనని అంటున్నారు హిజ్రాలు. ఉపాధిలేక, ఉండడానికి ఇళ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ మేరకు శుక్రవారం సిద్దిపేటలో మంత్రి హరీష్‌రావుకు, కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డికి తమ సంఘం తరపున వినతిపత్రం అందించారు.

చదువుకూ, ఉద్యోగానికి దూరం..
వీరు చదువుకుంటామన్నా స్కూళ్లు కుదరదంటున్నాయి. సామర్థ్యం ఉన్నా ఉద్యోగం రానంటోంది. ప్రతిభను ప్రదర్శిం చి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారు సైతం హిజ్రాల్లో ఉన్నారు.

కలిసి బతుకుతారు..
ఒక ప్రాంతంలో ఉండే హిజ్రాలకు ఇళ్లూ, వాకిలి ఒకటే. అందరూ కలిసి సంపాదించుకుంటారు. కలిసి బతుకుతారు. కష్టం, సుఖం పంచుకుంటారు.

గుర్తింపు కోసం పోరాటం...
హిజ్రాలు ఇప్పుడు గుర్తింపు కోసం పోరాడుతున్నారు. ఉత్తర భారతదేశంలో సముచిత గౌరవమే లభిస్తోంది వీరికి. తమిళనాడులో ప్రభుత్వ గుర్తింపు పొందిన వీరికి ప్రత్యేకంగా టీ అనే కాలమ్‌ ఏర్పాటు చేసింది. స్త్రీ పురుషులతో సమానంగా ట్రాన్స్‌జెండర్స్‌ను గుర్తిస్తోంది. ఇక్కడ కూడా తమనూ మనుషులుగా గుర్తించాలని కోరుకుంటున్నారు.

ఓటు హక్కు కల్పించాలి...
నేటికీ మాకు ఓటు హక్కు లేదు. ఇప్పటికైనా మాకు ఓటు హక్కు కల్పించాలి. ఓటు హాక్కు లేకపోవడంతో ప్రభుత్వాలు మమ్మల్ని గుర్తించడం లేదు. మాకు సరైన సౌకర్యాలు కల్పించాలి. మాకు జీవనోపాధి కల్పించేలా, పెన్షన్‌ ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.–సోని, ట్రాన్స్‌జెండర్‌.

 అవకాశాలు ఇస్తే నిరూపించుకుంటాం...
మేం కావాలని ఈ జీవితాన్ని అనుభవించడం లేదు. మాలోను చదువుకున్న వారు చాలా మంది ఉన్నారు. అవకాశాలు ఇస్తే మేం ఎందులో తక్కువ కాదని నిరూపించుకుంటాం. మాకు ఉపాధి కల్పించి సమాజంలో మమ్మల్ని ఒక వర్గంగా గుర్తించాలి. ప్రభుత్వ ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలి.  –సునీత, హిజ్రా

 మమ్మల్ని తక్కువగా చూడొద్దు..
సమాజంలో మేము భాగమే. హిజ్రాలు అంటే ఏదో కొత్తగా వచ్చిన వ్యక్తులుగా చూడడం మంచిది కాదు. పురాణాల్లో సైతం మాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటివి చూసైనా సమాజంలో మార్పు రావాలి. మేం కావాలని ఇలా మారడంలేదు. మాకు దేవుడిచ్చిన శాపంగా భావించి జీవితాన్ని గడుపుతున్నాం. మగ వాళ్లు చేసే పనులు, ఆడ వాళ్లు చేసే పనులూ రెండు మేం చేయగలం. మేం ఎందులో తక్కువ కాదు. మమ్మల్ని తక్కువగా చూడొద్దు.  –ఆకుల మమత. హిజ్రా సంఘం అధ్యక్షురాలు, సిద్దిపేట

మరిన్ని వార్తలు