హిమాలయాల నుంచి గోదావరి వరకు..

20 Feb, 2018 03:30 IST|Sakshi

మానస్‌ నుంచి మహానది మీదుగా గోదావరి నదుల అనుసంధానం 

నేటి దక్షిణాది రాష్ట్రాల సాగునీటి మంత్రుల భేటీలో ప్రతిపాదించనున్న రాష్ట్రం 

కృష్ణా జలాల్లో వాటా పెంపు, కాళేశ్వరం జాతీయ హోదాపైనా పట్టు 

సాక్షి, హైదరాబాద్‌: నదుల అనుసంధానానికి సంబంధించి సరికొత్త ప్రతిపాదనను రాష్ట్రప్రభుత్వం తెరపైకి తీసుకురానుంది. హిమాలయాల నుంచి మానస్‌–సంకోశ్‌–తీస్తా–గంగా–సువర్ణరేఖ–మహానదుల మీదుగా గోదావరికి నదుల అనుసంధానం చేపట్టాలని కేంద్రాన్ని కోరనుంది. మంగళవారం హైదరాబాద్‌లో జరగనున్న దక్షిణాది రాష్ట్రాల జలవనరుల ప్రాంతీయ సదస్సులో సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఈ అంశాన్ని ప్రతిపాదించనున్నారు. హిమాలయాల నుంచి గోదావరికి నదీ ప్రవాహాలు మళ్లిస్తే భవిష్యత్‌ తరాలకు నీటి కొరత ఉండదని వివరించనున్నారు. 938 టీఎంసీల నీటితో గోదావరికి అనుసంధానం చేస్తే దక్షిణాది వాటర్‌ గ్రిడ్‌ పటిష్టమవుతుందని, కృష్ణా బేసిన్‌లో భవిష్యత్‌ నీటి కొరతకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రకటించనున్నారు.  

‘గోదావరి–కావేరీ’నే ప్రధానం..! 
హైదరాబాద్‌లోని బేగంపేట తాజ్‌ వివాంటా హోటల్‌లో జరగనున్న సదస్సుకు కేంద్ర జలవనరుల శాఖ సహాయ మంత్రి అర్జున్‌ రాం మేఘవాల్‌ నేతృత్వం వహించనున్నారు. తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల సాగునీటి శాఖ మంత్రులు పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్‌రావు, ఈఎన్‌సీ మురళీధర్, అంతర్రాష్ట్ర జల వనరుల విభాగం అధికారులు హాజరవనున్నారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై సదస్సులో ప్రధానంగా చర్చ జరిగే అవకాశముంది. గోదావరిపై ఖమ్మం జిల్లా వెంకటాపురం మండలం అకినేపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి, అక్కడి నుంచి 247 టీఎంసీల మిగులు జలాలను నాగార్జునసాగర్‌కు ఎత్తిపోసి, అటునుంచి గ్రావిటీ ద్వారా సోమశిల మీదుగా కావేరీకి తరలించాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. దానిపై ఇదివరకే కేంద్రం ఓమారు సమావేశం నిర్వహించగా.. నీటి లభ్యత, ముంపు తదితరాలపై రాష్ట్రం అనేక అనుమానాలు లేవనెత్తింది. మహానది నుంచి గోదావరికి మిగులు జలాలు తెచ్చాకే కావేరీ అనుసంధానం చేపట్టాలని కోరింది.  

575 టీఎంసీలపై పట్టు.. 
కృష్ణా జలాల్లో ఉమ్మడి రాష్ట్రానికున్న 811 టీఎంసీల వాటాలో 575 టీఎంసీలు రాష్ట్ర వాటా కింద కేటాయించాలని రాష్ట్రం కోరనుంది. పోలవరం, పట్టిసీమల కింద దక్కే వాటాలతో పాటు, తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన వాటా కూడా తేల్చిన తరువాతే కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని నిర్ణయించాలని పట్టుబట్టే అవకాశముంది. కాళేశ్వరం జాతీయ హోదాపైనా కేంద్రాన్ని కోరనుంది. బ్రిజేష్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌ అవార్డు ప్రకటించిన తరువాతే బోర్డుల పరిధిలోని ప్రాజెక్టులను నిర్ణయించాలని డిమాండ్‌ చేయనుంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు నీటిని అడ్డగోలుగా తరలిస్తున్న విషయాన్ని భేటీలో లేవనెత్తాలని సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి హరీశ్‌ నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టులో ముంపునకు గురయ్యే తెలంగాణ ప్రాంతాల పరిరక్షణ అంశాన్నీ ప్రస్తావించనున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు