హిందూత్వభావన ప్రపంచానికే ఆదర్శం

22 May, 2015 23:31 IST|Sakshi

ఘట్‌కేసర్(రంగారెడ్డి జిల్లా): వసుదైక కుటుంబం అనే హిందుత్వ భావన ప్రపంచానికే ఆదర్శమని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ విశ్వ ప్రచారక్ బండి జగన్‌మోహన్ అన్నారు. మండలంలోని అన్నోజిగూడలో శుక్రవారం సాయంత్రం జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ శిక్షావర్గ ముగింపు సమావేశానికి ఆయన ప్రధానవక్తగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న కృషి కారణంగా హిందూ జాతి సగర్వంగా ఉందన్నారు. హిందూ జాతి పరిరక్షణ కోసం అనేక మంది కార్యకర్తలు తయారవుతున్నారన్నారు.

దేశంలోని ప్రజలందరి నమ్మకం, విశ్వాసం పొంది హిందూజాతి మహాశక్తిగా రూపొందిందన్నారు. ప్రపంచంలో ఉగ్రవాదుల దాడులు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మన యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఐక్యరాజ్యసమితిలో యోగ గొప్పతనాన్ని తెలపడంతో అందులోని 177 దేశాలు అంగీకరించి జూన్21ని యోగదినంగా ప్రకటించాయన్నారు. ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు హెడ్గేవార్ పుట్టిన రోజు ఆ రోజే కావడం విశేషమన్నారు. ఇది హిందూజాతికి గొప్ప విషయమన్నారు. ఒక అమెరికాలోనే లక్ష వరకు యోగా సెంటర్లు పనిచేస్తున్నాయన్నారు. ప్రపంచమంతా హిందూజాతికి చెందిన యోగాను గుర్తించి ఆచరిస్తోందన్నారు.

ప్రపంచవ్యాప్తంగా హిందువుల పండుగలు జరుపుతున్నారన్నారు. రానురాను హిందుత్వ వాతావరణం పెరుగుతోందన్నారు. భగవద్గీత ఆరాధ్యగ్రంథంగా మారిందన్నారు. పలు మేనేజ్‌మెంట్ కోర్సుల్లో అందులోని పాఠాలు ప్రవేశ పెడుతున్నారన్నారు. ఇండోనేషియా వంటి ముస్లిం దేశాల్లో ప్రాచీన హిందూ దేవాలయం బయటపడిందన్నారు. హిందూ సమాజంలో ఉన్న లోపాలను సవరించుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. రెండు గ్లాసుల పద్ధతి పోవాలన్నారు. చిన్న కుటుంబాలతో సమస్యలు పెరిగి పోతున్నాయన్నారు. ఒత్తిళ్ల కారణంగా అనేకమంది మానసిక రోగులుగా మారుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పరిస్థితిలో మార్పురావాలన్నారు. అంతకు ముందు ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ప్రదర్శించిన కర్ర విన్యాసాలు ఆకట్టుకున్నాయి.

>
మరిన్ని వార్తలు