వేలుపుగొండలో కొత్త రాతి చిత్రాలు

23 Sep, 2018 02:45 IST|Sakshi
బండపై ఎరుపురంగులో గీసిన చిత్రం

కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధనలో వెలుగులోకి..

గుట్టపైన నాలుగు ప్రాంతాల్లో 4 ‘చారిత్రక’ చిత్రాల గుర్తింపు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్త రాతిచిత్రాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రాచీన మానవుని గురించి తెలుసుకోమంటూ సవాళ్లు విసురుతూనే ఉన్నాయి. తాజాగా మెదక్‌ జిల్లా టేక్మల్‌ మండలం వేలుపుగొండకి పడమరన ఉన్న చిన్న రాతి గుట్టపైన విష్ణుకుండినుల కాలంనాటి శివాలయం గుండం, నివాస నిర్మాణాల జాడలను కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశీలించింది. ఈ పరిశోధనల్లో 4 రాతి చిత్రాల ప్రదేశాలను గుర్తించింది.  

పగులు అంచుల్లో.. 
గుట్టపైకి వెళ్లే మెట్ల మార్గానికి ఎడమ వైపున 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల వెడల్పుతో ఎరుపు రంగులో వేసిన రాతి చిత్రం ఉంది. ఈ చిత్రంలో అక్కడక్కడ చెట్ల కొమ్మలు, మనిషి తలలు కనిపిస్తున్నాయి. రాతి చిత్ర పరిశోధకులకు చాలెంజ్‌ విసిరినట్లు ఉన్న ఈ చిత్రం రంగు తాజాదనం, చిత్రణ ఆధారంగా చారిత్రక కాలానిదని పరిశోధకులు చెబు తున్నారు. ఈ రాతి చిత్రంబండను ఆనుకుని ఉన్న పడగరాయిలో శీర్ష కోణంలో ఉన్న పగులు రెండం చుల్లో రాతిచిత్రాలు ఉన్నాయి. వీటిలో ఓ నెమలి బొమ్మ.. దాని అంచులో పైకి సాగిన తీగ, తీగ వెం బడి ఆకులు, మొగ్గలు కనిపిస్తున్నాయి. రాతి తావుకు రెండంచుల్లో ఒకే పూలతీగ కనిపిస్తోంది. ఇక్కడ కూడా ప్రాచీన మానవుని రాతి చిత్రాలు తక్కువగానే ఉన్నాయి. పాత రాతి చిత్రాల మీద కొత్తగా చారిత్రక దశలో గీసిన రాతి చిత్రాల్లా ఇవి కనిపిస్తున్నాయి.

మధ్యరాతి యుగానివా? 
3, 4 రాతి చిత్రాల ప్రదేశాలు మెట్ల మార్గానికి కుడివైపున 30 అడుగుల ఎత్తులో ఉన్నాయి. ఇవి 30 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పున్న రాతి కాన్వాసు మీద గీసిన ఎరుపురంగు రాతి చిత్రాలు. ఈ చిత్రాలున్న ప్రదేశం కింద రాతి గుహలున్నాయి. ఇక్కడ ఒక గుహ ద్వారం అంచున రాతి చిత్రాలు, తెల్లని రం గులో హనుమంతుని చిత్రమూ కనిపిస్తోంది. ఇక్కడి రాతి చిత్రాలు కూడా చారిత్రక దశకు చెందినవే. కానీ బృంద సభ్యుడు బొగ్గుల శంకర్‌రెడ్డికి గుహలో లభించిన రాతి పనిముట్లలో కొన్ని మధ్య రాతియుగం, కొత్త రాతియుగానికి చెందినవి ఉన్నాయి. ఈ రాతిగుహల్లో మానవులు మధ్య రాతియుగాల నుంచి నివసించినట్లు వీటి ద్వారా రుజువవుతోంది. ఇప్పుడు కనిపిస్తున్న రాతి చిత్రాలు పాత రాతి చిత్రాల మీద వేసిన కొత్త చిత్రాల్లా కనిపిస్తున్నాయి.  పరిసరాల్లో  పరిశోధిస్తే మరెన్నో చిత్రా లు కనిపించే అవకాశముందని పరిశోధకులు చెబుతున్నారు. 

ప్రభుత్వమే రక్షించాలి

మానవ పరిణామ క్రమం తెలుసుకోడానికి ఆదిమ కాలం నాటి ఆధారాలే కీలకం. అందుకే అలాంటి ప్రదేశాలను ప్రభుత్వం రక్షించాలి. తద్వారా అవి పరిశోధకులు, పర్యాటకులకు కేంద్రంగా నిలుస్తాయి. అప్పటి గుహలు, సమాధుల్లో లభించే ఆధారాలే నేటి తరానికి గొప్ప వారసత్వ సంపద. ఇలాంటి రాతి చిత్రాల గురించి పురావస్తు శాఖ విస్తృతంగా పరిశోధనలు జరపాల్సిన అవసరం ఉంది. 
    – రామోజు హరగోపాల్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం 

టేక్మల్‌ మండలం వేలుపుగొండ గ్రామం వద్ద గుహలో లభ్యమైన రాతి పనిముట్లు

రాతిపై నెమలి బొమ్మ

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా