అమరచింత ఇదీ చరిత్ర..

6 Jan, 2020 08:01 IST|Sakshi
అమరచింత పట్టణ వ్యూ

నాడు సంస్థానం.. 

నిన్న నియోజకవర్గ కేంద్రం.. 

నేడు మున్సిపాలిటీగా అవతరించిన వైనం

సాక్షి, అమరచింత (కొత్తకోట): ఒకప్పుడు అమ్మాపురం సంస్థానంతోపాటు అమరచింత కూడా సంస్థానంగా విరాజిల్లింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో అమరచింత సంస్థానం అప్పట్లో 69 గ్రామాలను కలిగి దాదాపు 190 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉండేది. సంస్థాన పరిపాలన అమ్మాపురం కేంద్రంగా కొనసాగుతుండేది. కాకతీయుల కాలంలో క్రీ.శ. 1676లో ఇమ్మడి గోపిరెడ్డి కుమారుడు సర్వారెడ్డి సంస్థానాన్ని అభివృద్ధిపర్చారు. మహారాణి భాగ్యలక్ష్మీదేవమ్మ అమ్మాపురంను కేంద్రంగా చేసుకుని అమరచింతను పరిపాలిస్తున్న కాలంలో సంస్థానంగా వెలుగొందింది. 

సంస్థానాల విలీనం తర్వాత.. 
భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి.. నిజాం పరిపాలన ముగిసిన తర్వాత సంస్థానాలను విలీనం చేశారు. దీంతో సంస్థాన కేంద్రంగా కొనసాగిన అమరచింతను నియోజకవర్గ కేంద్రంగా రూపొందించారు. ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహించి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టిసారిస్తూ వచ్చారు. గత కొన్ని సంవత్సరాల క్రితం నియోజకవర్గాల పునర్విభజన, కొత్త నియోజకవర్గాల ఏర్పాటులో అమరచింత నియోజకవర్గాన్ని రద్దుపర్చడంతో కేవలం అమరచింత ఓ గ్రామంగా మారింది. 

కొత్త మున్సిపాలిటీల ఏర్పాటులో.. 
తెలంగాణ ప్రభుత్వం కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసిన క్రమంలో ఒకప్పుడు అమరచింత సంస్థాన కేంద్రంతోపాటు నియోజకవర్గ కేంద్రంగా కొనసాగిన అభివృద్ధిలో వెనుకబడటంతో ప్రభుత్వం అమరచింతను కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటు చేసింది. దీంతో సంస్థానాన్ని కోల్పోయిన అమరచింత నియోజకవర్గ కేంద్రాన్ని కోల్పోయి ప్రస్తుతం మున్సిపాలిటీ కేంద్రంగా రూపాంతరం చెందింది. 

మరిన్ని వార్తలు