ఔటర్‌.. రిపేర్‌

4 Sep, 2018 10:05 IST|Sakshi

ఓఆర్‌ఆర్‌ మరమ్మతులపై హెచ్‌ఎండీఏ దృష్టి  

‘ప్రగతి నివేదన’ ప్రత్యేక దారుల మూసివేత  

పటిష్టత దెబ్బతినకుండా ఇంజినీరింగ్‌ నిపుణులతో పనులు  

వాహనాల టోల్‌ వసూల్‌కు నిర్ణయం  

టీఆర్‌ఎస్‌కు లేఖ రాయనున్న హెచ్‌ఎండీఏ  

నేడు అధికారులతో కమిషనర్‌ సమావేశం

సాక్షి, సిటీబ్యూరో: రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో ఆదివారం టీఆర్‌ఎస్‌ నిర్వహించిన ‘ప్రగతి నివేదన’ బహిరంగ సభ నేపథ్యంలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)లో ప్రత్యేక దారులు ఏర్పాటు చేసిన విషయం విదితమే. మెయిన్‌ క్యారేజ్‌వే నుంచి సర్వీసు రోడ్డు వరకు వేసిన తాత్కాలిక రహదారుల మూసివేతపై హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) దృష్టి సారించింది. ప్రధానంగా రావిర్యాల, తుక్కుగూడ, బొంగళూర్‌ మార్గంలో మంగళవారం నుంచి ఓఆర్‌ఆర్‌ మెయిన్‌ క్యారేజ్‌వే మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించింది. మెయిన్‌ క్యారేజ్‌వే నుంచి సర్వీసు రోడ్డు వరకు వేసిన తాత్కాలిక మట్టి రహదారులను తొలగించడంతో పాటు ఓఆర్‌ఆర్‌ పటిష్టత దెబ్బతినకుండా ఇంజినీరింగ్‌ నిపుణుల పర్యవేక్షణలో పనులుచేపట్టనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థన మేరకు ఆదివారం ఉదయం 9గంటల నుంచి రాత్రి 12గంటల వరకు వెళ్లిన వాహనాల టోల్‌ ఫీజు చెల్లింపులపై తార్నాకలోని హెచ్‌ఎండీఏ కేంద్ర కార్యాలయంలో కమిషనర్‌  జనార్దన్‌రెడ్డి అధ్యక్షతన అధికారులు సమవేశమై నిర్ణయం తీసుకోనున్నారు. ఆ రోజు వచ్చి వెళ్లిన వాహనాల సంఖ్యను పరిగణనలోకి తీసుకొని టోల్‌ ఫీజు చెల్లించాలంటూ టీఆర్‌ఎస్‌ పార్టీకి లేఖ రాయనున్నారు.  

టోల్‌ ఫీజుపై నేడు స్పష్టత...  
నగరాభివృద్ధిలో 158కి.మీ ఔటర్‌ కీలకంగా మారింది. వివిధ జాతీయ, రాష్ట్ర రహదారులకు అనుసంధానం చేయడంతో ఔటర్‌పై వాహనాల రద్దీ నానాటికీ పెరుగుతోంది. రోజు సగటున లక్షకు పైగా వాహనాలు వెళ్తున్నట్లు అంచనా. టోల్‌ రుసుములను వసూలు చేసేందుకు గాను 19 ఇంటర్‌ఛేంజ్‌ల వద్ద 180 టోల్‌ లేన్లు ఉన్నాయి. ఓఆర్‌ఆర్‌లో రోజుకు లక్షకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. తద్వారా హెచ్‌ఎండీఏకు రోజు రూ.87లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఓ ప్రైవేట్‌ సంస్థ ద్వారా టోల్‌ వసూలు చేస్తున్న హెచ్‌ఎండీఏకు ఈ సంస్థ ప్రతి నెలా రూ.26 కోట్లు చెల్లిస్తోంది. ఇటీవల వాహనదారుల సౌలభ్యం కోసం ప్రయోగాత్మకంగా తీసుకొచ్చిన స్మార్ట్‌కార్డుల ద్వారా టోల్‌ చెల్లింపుతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి వాయిదా వేసిన హెచ్‌ఎండీఏ అధికారులు... సెప్టెంబర్‌ 2న ప్రగతి నివేదన సభకు వచ్చే వాహనాల టోల్‌ వసూలు చేస్తే అష్టకష్టాలు పడాల్సి వస్తోందన్న విషయాన్ని ‘సాక్షి’ ప్రముఖంగా ప్రచురించింది. ఈ నేపథ్యంలోనే టీఆర్‌ఎస్‌ ఆ రోజు వచ్చే వాహనాలకు టోల్‌ చెల్లిస్తామంటూ హెచ్‌ఎండీఏకు లేఖ రాయడంతో అందుకు అనుమతించారు. దీంతో లక్షలాది వాహనాలు ఔటర్‌పైకి వచ్చినా ఎక్కడా ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తలేదు. ఈ టోల్‌ ఫీజు వసూలుపైనే హెచ్‌ఎండీఏ అధికారులు మంగళవారం ఓ నిర్ణయానికి వచ్చి టీఆర్‌ఎస్‌ పార్టీకి చార్జీలు చెల్లించాలంటూ లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నారు. 

వర్షంతో ఇబ్బందులు...  
ప్రగతి నివేదన సభకు అనుబంధంగా వాహనాల పార్కింగ్‌ కోసం రావిర్యాల, తుక్కుగూడ, బొంగళూర్‌ మార్గంలో ఔటర్‌ నుంచి కొత్తగా నిర్మించిన 8 మట్టి రహదారుల తొలగింపు అధికారులకు తలనొప్పిగా మారింది. మంగళవారం నుంచి పనులు ప్రారంభించి వాహనదారుల ఇబ్బందులపై దృష్టి సారిస్తామని అధికారులు పేర్కొన్నారు. అయితే కొంతమంది వాహనదారులు టోల్‌ చెల్లించాల్సి వస్తుందని ఈ మార్గాల ద్వారా సర్వీసు రోడ్ల మీదకు వచ్చి వెళ్లారని టోల్‌ వసూలు చేస్తున్న ప్రైవేట్‌ సంస్థ అధికారులు వాపోతున్నారు. సాధ్యమైనంత తొందరగా ఈ రహదారులను మూసివేయాలని కోరుతున్నారు.  

మరిన్ని వార్తలు