అనుమతుల వెనుక..

13 May, 2019 07:45 IST|Sakshi
మాజీ సర్పంచ్‌తో అనుమతులు తీసుకుని చేపడుతున్న బహుళ అంతస్తుల భవనం

చేతులు మారిన రూ. లక్షలు  

పెద్దఅంబర్‌పేటలో అక్రమ నిర్మాణాలకు

సహకరించినందుకు రూ. అర కోటి?    

అధికారులు, పలువురు సభ్యుల చేతివాటం

హెచ్‌ఎండీఏ అధికారులను సైతం తప్పుదోవ పట్టిస్తున్న వైనం

ఒకేచోట అక్రమ నిర్మాణాలతో సర్కారు ఖజానాకు రూ. 2 కోట్ల గండి

ఇలాంటి అక్రమ నిర్మాణాల్లో మరెన్నో

పెద్దఅంబర్‌పేట: పెద్దఅంబర్‌పేట పురపాలక సంఘం పరిధిలో అధికారుల కనుసన్నల్లో నడుస్తున్న అక్రమ నిర్మాణాల బాగోతం ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అవినీతి అధికారుల తీరుతో ఇటు హెచ్‌ఎండీఏకు, అటు పురపాలక సంఘానికి కోట్లాది రూపాయల మేర గండి పడుతోంది. పాలకవర్గంలోని కొందరు సభ్యులతో చేతులు కలిపిన ఇక్కడి అధికారులు అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ వాటి వల్ల వచ్చే సొమ్మును ‘తిలాపాపం తలాపిడికెడు’ అనే చందంగా దోచుకుంటున్నారు. ఈ క్రమంలోనే పెద్దఅంబర్‌పేట 5వ వార్డు పరిధిలోకి వచ్చే ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న కార్పొరేట్‌ భవనం నుంచి హెచ్‌ఎండీఏ, పెద్దఅంబర్‌పేట పురపాలక సంఘానికి రావాల్సిన సుమారు రూ. 2 కోట్ల రూపాయలను దారి మళ్లించారు. అధికారులు, కొంతమంది సభ్యులు సదరు భవన నిర్మాణదారుడి నుంచి రూ. 50లక్షలు (అరకోటి) ముడుపులు తీసుకున్నారనే విమర్శలు  స్థానికంగా గుప్పుమంటున్నాయి. సుమారు లక్ష నుంచి లక్షా ముప్పై వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించిన, నిర్మిస్తున్న భవనాలను అడ్డుకోవాల్సిన అధికారులు మిన్నకుండిపోయి ఉచిత సలహాలు ఇస్తూ అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తున్నారు.  

రెండు భవనాలూ అక్రమంగానే..   
5 వ వార్డు పరిధిలో ఔటర్‌ రింగ్‌ రోడ్డు సమీపంలో కొనసాగుతున్న రెండు భవనాలు కూడా అక్రమ నిర్మాణాలే. అందులో ఒకటి హెచ్‌ఎండీఏ అనుమతితో నిర్మాణం చేపట్టామని చెబుతున్నప్పటికీ, అధికారుల ఇచ్చిన అనుమతి మ్యాప్‌లో ఒక విధంగా ఉంటే నిర్మాణం మాత్రం అందుకు విరుద్ధంగా కొనసాగుతోంది. సాధారణంగా హెచ్‌ఎండీఏ అధికారులు సెల్లార్‌ను వాహనాల పార్కింగ్‌కు కేటాయిస్తూ అనుమతిస్తారు. అయితే, అలా కాకుండా సెల్లార్‌ను మొత్తం గదులతో నిర్మించి హెచ్‌ఎండీఏ అధికారులను సైతం మోసగించే ప్రయత్నం జరుగుతోంది. దీంతో పాటు ఈ భవానికి పక్కనే నిర్మిస్తున్న (దాదాపు పూర్తికావచ్చిన ) భవనానికి పదేళ్ల క్రితం సర్పంచ్‌గా పనిచేసిన వ్యక్తి సంతకాలతో కూడిన అనుమతి పత్రాలతోనే భవనాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. ఇదే భవనం తరహాలోనే మరో భవనానికి పునాదులు తీసి పిల్లర్లు నిర్మిస్తున్నారు. ఈ తతంగం అంతా స్థానిక పెద్దఅంబర్‌పేట పురపాలక సంఘం పరిధిలోని అధికారులకు, పాలకవర్గంలో పలువురు సభ్యులకు తెలిసే జరుగుతుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అక్రమ వ్యవహారానికి సహకరిస్తున్న అధికారులకు, పలువురు సభ్యులకు నిర్మాణదారుడు రూ. అరకోటి వరకు ముడుపులు చెల్లించారని విశ్వసనీయ సమాచారం. 

ఏపీ మంత్రికి చెందిన కళాశాల కొనసాగింపు...
అయితే, ఈ అక్రమ భవనాల్లో ఒక దాంట్లో ప్రస్తుత ఏపీ మంత్రి నారాయణకు  చెందిన కళాశాల కొనసాగుతోంది. దీంతోపాటు పక్కనే నూతనంగా నిర్మాణం పూర్తి చేస్తున్న భవనాలు కూడా వచ్చే జూన్‌లో ఇదే కళాశాల యాజమాన్యానికి అప్పగించాలనే లక్ష్యంతో కొనసాగిస్తున్నారు. అయితే, వీటిలో ఏమాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా నిర్మించడంతో వందలాది మంది విద్యార్థులు జీవితాలతో చెలగాటం ఆడుతారా..? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అన్ని అనుమతులు,ఉన్నాయా లేదా అని నిర్ధారిం చుకున్న తర్వాతే విద్యాసంస్థల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చే ఉన్నత విద్యామండలి అధికారులు సైతం పట్టించుకోలేదనే ఆరోపణలు ఉన్నాయి.

హెచ్‌ఎండీఏ వద్ద అక్రమ నిర్మాణాల చిట్టా..?
పెద్దఅంబర్‌పేటలో కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలకు సంబంధించిన సమాచారం హెచ్‌ఎండీఏ అధికారుల వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. అనుమతి లేని భవనాలను అడ్డుకోవడంతో పాటు ప్రోత్సహిస్తున్న పెద్దఅంబర్‌పేట మున్సిపల్‌ కమిషనర్, టీపీఓలపై చర్యలు తీసుకోవాలంటూ పెద్దఅంబర్‌పేటకు చెంది న పలువురు హెచ్‌ఎండీఏ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం.  ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ అక్రమ భవన నిర్మాణాలను ప్రోత్సహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని హెచ్‌ఎండీఏ అధికారులను స్థానికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు