ఓఆర్‌ఆర్‌పై ‘చేంజ్‌’ ప్లీజ్‌!

4 Oct, 2018 10:56 IST|Sakshi

ఓఆర్‌ఆర్‌పై ట్రాఫిక్‌ జామ్‌లకు చెక్‌ పెట్టే వ్యూహం

టోలు చార్జీకి సరిపడా చిల్లర ఇవ్వాలని ప్రచారం

అన్ని టోలు గేట్ల వద్దా సైన్‌బోర్డులు..ప్రత్యేక ఏర్పాట్లు

స్మార్ట్‌ జర్నీ పనులు  వేగవంతం చేయాలని సిబ్బందికి ఆదేశాలు

హెచ్‌ఎండీఏ సమీక్షసమావేశంలో కమిషనర్‌ నిర్ణయం

సాక్షి, సిటీబ్యూరో: ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)పై ట్రాఫిక్‌ జామ్‌కు చెక్‌ పెట్టేందుకు హెచ్‌ఎండీఏ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ముఖ్యంగా టోలు రుసుము చెల్లింపుల్లో జాప్యం జరుగుతుండడం వల్లే ట్రాఫిక్‌ సమస్య ఎదురవుతున్నట్లు గుర్తించారు. ఇందుకు ప్రధానంగా ‘చిల్లర’ సమస్య కూడా కారణమని తేల్చారు. టోల్‌గేట్ల వద్ద రుసుం చెల్లించే క్రమంలో సరిపడా చిల్లరను వాహనదారు లు ఇవ్వకపోవడంతో లావాదేవీలకు కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటూ ట్రాఫిక్‌ జామ్‌కు కారణమవుతుందని హెచ్‌ఎండీఏ కమిషనర్‌ బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. దీనిపై వాహనదారులను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని ఆయన బుధవారం అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పేర్కొన్నారు.

‘ప్రతి రోజూ సగటున లక్షా ఇరవై నాలుగు వేల వాహనాలు ఓఆర్‌ఆర్‌పై ప్రయాణిస్తున్నాయి. ఒక్కో వాహనానికి 5 సెకన్ల సమయం చిల్లర వల్ల అనవసర జాప్యం జరుగుతున్నదనుకున్నా..మొత్తం అన్ని వాహనాలు 173 గంటల సమయం వృథాగా వాహనాలు వేచి ఉంటున్నాయి. దీనిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు టోల్‌ గేట్ల వద్ద సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని కమిషనర్‌ ఓఆర్‌ఆర్‌అధికారులనుఆదేశించారు. ఓఆర్‌ఆర్‌పై పెరుగుతున్న ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడంతో పాటు ఆర్‌ఎఫ్‌ఐడీ, స్మార్ట్‌ కార్డుల ద్వారా టోలు వసూలు అమలు నిర్ణీత గడువుపై కూడా సమీక్ష చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ...దీపావళికి ఆర్‌ఎఫ్‌ఐడీ ద్వారా టోలు వసూలు వ్యవస్థను పటిష్టంగా అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ లోగానే అన్ని సాంకేతిక ఇబ్బందులను అధిగమించడానికి ప్రయోగాత్మకంగా వసూలు చేసుకుని దీపావళి నాటికి ఆర్‌ఎఫ్‌ఐడీ పద్ధతిని ప్రజలకు అందుబాటులోనికి తీసుకురావాలని ఆదేశించారు.   

క్లోజ్డ్‌ టోలింగ్‌పై దృష్టి...
ఓఆర్‌ఆర్‌పై 2010లోనే ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌ (ఈటీసీ) పద్ధతిన వాహనదారుల నుంచి టోలుసుంకం వసూలు చేయాలని నిర్ణయించినా వివిధ కారణాల వల్ల అమలులో తీవ్ర జాప్యం జరిగింది. ఆ తర్వాత డెడికేటెడ్‌ షార్ట్‌ రేంజ్‌ కమ్యూనికేషన్‌ పద్ధతిన టోలు వసూలు చేయాలని నిర్ణయించినా జాతీయ రహదారులు, ఇతర రాష్ట్ర రహదారులపై అమలవుతున్న ఆర్‌ఎఫ్‌ఐడీ విధానంవైపే మొగ్గారు. ఇప్పటికే ఎలక్ట్రానిక్‌ టోల్‌ కలెక్షన్‌లో భాగంగా స్మార్ట్‌ కార్డుల ద్వారా టోలు వసూలు కోసం జైకా ద్వారా రూ.70 కోట్ల నిధులు హెచ్‌ఎండీఏ రుణంగా తీసుకుంది. అయితే 181 లైన్లున్న ఓఆర్‌ఆర్‌పై ఎంట్రీ వైపు 82 లైన్లు, ఎగ్జిట్‌ 99 లైన్లు ఉన్నాయి. ఇందులో 112 లైన్లలో నగదు, స్మార్ట్‌ కార్డ్‌ ద్వారా (మాన్యువల్‌) టోలు వసూళ్లు చేయనున్నారు. 51 లైన్లలో నగదు,  స్మార్ట్‌ కార్డులు మరియు ఆర్‌ఎఫ్‌ఐడీ పద్ధతుల్లో వసూలు చేస్తారు. అందులో 18 లేన్లు కేవలం ఆర్‌ఎఫ్‌ఐడీ ద్వారానే టోల్‌ వసూలు చేయాలని ఓఆర్‌ఆర్‌ అధికారులు నిర్ణయించారు. ఇటీవల బదిలీపై వచ్చిన కమిషనర్‌ డా.బి.జనార్దన్‌రెడ్డి వారంలో ఓ రోజు ఓఆర్‌ఆర్‌ ట్రాఫిక్‌ రద్దీ తగ్గింపుపైపే సమీక్షలు నిర్వహిస్తూ సిబ్బందికి దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఓఆర్‌ఆర్‌ అధికారులు ఓపెన్‌ టోలింగ్‌ పద్దతిలో వాహనదారుల నుంచి నిర్ధారిత టోలు సుంకం వసూలు చేస్తున్నారు. కొత్తగా అమలు చేయాలనుకుంటున్న క్లోజ్డ్‌ టోలింగ్‌ పద్ధతిలో వాహనదారులు, వారు ఉపయోగించే వాహన శ్రేణి ప్రకారం ఎగ్జిట్‌ పద్ద వారు ప్రయాణం చేసిన దూరానికి మాత్రమే టోలు వసూలు చేస్తారు.

వాహనదారులు సహకరించాలి
ప్రతి వాహనదారుడు టోలు సుంకానికి సరిపడా చిల్లరను తీసుకురావాలి. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. టోలుగేట్ల వద్ద రద్దీ కూడా తగ్గుతుంది. ఈ మధ్య కాలంలో టోల్‌ గేట్ల వద్ద 150 మీటర్ల మేరకు వాహనాలు నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి. వాహనదారులు అవసరమైన చిల్లరను తీసుకువస్తే టోలు చెల్లింపు, వసూలులో జరుగుతున్న జాప్యాన్ని తగ్గించవచ్చు. అలాగే త్వరలో తీసుకురానున్న ఆర్‌ఎఫ్‌ఐడీ, ఈటీసీ,  క్యూఆర్‌ కోడ్‌ పద్ధతులను కూడా అందరూ వినియోగించుకోవాలి.– కమిషనర్, డా.బి.జనార్దన్‌రెడ్డి 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా